మోదీ కటౌట్ పై పడ్డ వాననీటిని తుడిచిన అభిమాని.. అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్
Add ap7am to your home Screen

మోదీ కటౌట్ పై పడ్డ వాననీటిని తుడిచిన అభిమాని.. అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్

Amit shah shares video of man wiping off rain water on Modi cutout in Karnataka
  • మోదీ కటౌట్‌పై వాననీటిని కండువాతో తుడిచిన అభిమాని
  • డబ్బుల కోసం చేయట్లేదని వ్యాఖ్య
  • మోదీయే మాకు దేవుడంటూ తీవ్ర భావోద్వేగం
  • ఘటన వీడియోను షేర్ చేసిన హోం మంత్రి అమిత్ షా
  • ఈ అభిమానమే మా బలం అంటూ వ్యాఖ్య
ప్రధాని మోదీ కటౌట్‌పై పడ్డ వాన నీటిని తన కండువాతో తుడిచిన అభిమాని వీడియోను హోం మంత్రి అమిత్ షా తాజాగా షేర్ చేశారు. ఈ అభిమానమే బీజేపీ శక్తి అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కర్ణాటకలోని దేవనహళ్లి ప్రాంతంలో శుక్రవారం బీజేపీ రోడ్ షో ప్లాన్ చేసింది. పలు ప్రాంతాల్లో మోదీ కటౌట్లు ఏర్పాటు చేసింది. ఈ సభకు హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే.. వర్షం కారణంగా ఈ రోడ్ షో రద్దయిపోయింది.

ఈ క్రమంలో ఓ మోదీ కటౌట్‌పై వాన చినుకులను చూసిన అభిమాని ఒకరు తన కండువాతో వాటిని తుడిచేశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావా? అని అతడు ఆ అభిమానిని ప్రశ్నించగా..‘‘నాకు డబ్బులు అవసరం లేదు. నేను ఎవరి నుంచీ డబ్బులు ఆశించను. మోదీపై విశ్వాసం, ప్రేమాభిమానాలతోనే ఇదంతా చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడా అభిమాని. అంతేకాకుండా.. మోదీ మాకు దేవుడు అంటూ తీవ్రభావోద్వేగానికి లోనవుతూ సమాధానమిచ్చాడు. 

ఈ వీడియోను హోం మంత్రి అమిత్‌షా ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. ‘‘మోదీపై అచంచల విశ్వాసం, నిస్వార్థ ప్రేమాభిమానాలే బీజేపి బలం, ఆస్తి. ఈ అద్భుతమైన వీడియో చూడండి’’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ శాఖ కూడా స్పందించింది. రాష్ట్రంలో అనేక మంది మోదీని తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారని వ్యాఖ్యానించింది.
Advertisement
Karnataka
Narendra Modi
Amit Shah

More Telugu News