Jada Sravan Kumar: వైసీపీని గద్దె దింపే శక్తి టీడీపీకే ఉంది: జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్

Jada Sravan Kumar attends TDP All Party Meeting
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలో టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీని ఓడించే శక్తి టీడీపీకే ఉందని స్పష్టం చేశారు. జగన్ సర్కారును గద్దె దింపేది ఎస్సీ, ఎస్టీలేనని ఉద్ఘాటించారు. 'గడప గడపకు దగా' పేరిట త్వరలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం కేసు వరకు పోరాటం చేస్తున్నానని, ఎవరూ తన వెనుక రావడంలేదని, బాధితులు కూడా రాజీపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం బలహీనవర్గాలు జగన్ కు ఓటేస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. 

ఇక, బలాన్ని అంచనా వేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవద్దని జనసేన పార్టీకి సూచిస్తున్నట్టు జడ శ్రవణ్ తెలిపారు. మతవాదుల పార్టీలతో పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

కాగా, వైసీపీ ప్రభుత్వ చర్యలపై సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు, జిల్లా, మండల స్థాయుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అణచివేతకు గురైన వారికి ఈ వేదికల ద్వారా అండగా నిలవాలని నిశ్చయించారు.
Go Back to Shorts
Jada Sravan Kumar
All Party Meeting
TDP
Vijayawada

More Telugu News