దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నా... రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చు: నారాయణ అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు
- ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
- ఖండించిన రఘురామకృష్ణరాజు
- కొడతారేమోనంటూ వ్యాఖ్యలు
- జగన్, బొత్సలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్
అయితే వీరికొక అలవాటుందని, విచారణ చేపట్టే గదుల్లో కెమెరాలు తీసేస్తారని, వ్యక్తిగత సిబ్బందిని కూడా పంపించేస్తారని రఘురామ వెల్లడించారు. కొట్టడం కోసమే ఆ విధంగా చేస్తారని, ఆ తర్వాత పచ్చి అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. ఇవన్నీ తన కేసులోనూ జరిగాయని, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు.
కాగా, నారాయణ శారీరక దారుఢ్యం ఏ మేరకు ఉందో తెలియదు కానీ, రెండు మూడు దెబ్బలు కొడితే ఏమైనా జరగొచ్చని తెలిపారు. నారాయణ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే కోర్టును ఆశ్రయించడం మంచిదని, ఈ ప్రభుత్వ పెద్దలు ఎంతవరకైనా తెగించే రకం అని రఘురామ స్పష్టం చేశారు.
ప్రభుత్వ అన్యాయాల్ని నిలదీయడానికి ప్రజలు క్రమంగా బయటికొస్తున్నారని, ఓ సీనియర్ నేతను అరెస్ట్ చేస్తే వాళ్లందరూ భయపడతారని భావిస్తున్నారని వివరించారు.
ఈ కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం న్యాయం అనుకుంటే, సీఎం జగన్ ను, బొత్సను కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యవాదులు నారాయణ అరెస్ట్ ను ఖండించాలని తెలిపారు.