Space X: అంతరిక్ష యాత్రల్లో స్పేస్ ఎక్స్ మరో ఘనత

Space X all private space tour to ISS for the first time
  • ఐఎస్ఎస్ కు నలుగురు వ్యోమగాములు
  • తొలిసారిగా ఐఎస్ఎస్ కు ప్రైవేటు యాత్ర
  • 20 గంటలు ప్రయాణించనున్న స్పేస్ క్రాఫ్టు
  • ఇదో మైలురాయి అని అభివర్ణించిన నాసా
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష యాత్రల్లో మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు స్పేస్ ఎక్స్ వ్యోమనౌక తాజాగా నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లింది. ఐఎస్ఎస్ కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. 

కాగా, నలుగురు వ్యోమగాముల బృందాన్ని హూస్టన్ కు చెందిన ఆక్సియోమ్ స్పేస్ ఐఎన్సీ సంస్థ ఐఎస్ఎస్ కు పంపింది. ఇందుకోసం స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను వినియోగించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లో నాసాకు చెందిన కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక నింగికి ఎగిసింది. 

ఇందుకోసం 25 అంతస్తుల ఎత్తు ఉన్న భారీ వ్యోమనౌకను వినియోగించారు. దీన్ని రెండు దశల ఫాల్కన్ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దీని పైభాగాన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లో నలుగురు వ్యోమగాములు ఆసీనులయ్యారు. ఈ బృందానికి నాసా వ్యోమగామి మైకేల్ లోపెజ్ అలెగ్రియా నాయకత్వం వహిస్తున్నారు. 

20 గంటల ప్రయాణం అనంతరం వీరు శనివారం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటారని అంచనా వేశారు. రాకెట్ నుంచి విడిపోయిన అనంతరం స్వయం ఛోదిత క్రూ డ్రాగన్ క్యాప్సూల్ భూమికి 400 కిమీ ఎత్తులో ఐఎస్ఎస్ కు అనుసంధానమవుతుంది.

More Telugu News

Space X
ISS
Falcon 9
Crew Dragon