జలాంతర్గాముల కొనుగోలు వివాదం... ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడనున్న బైడెన్
- ఆస్ట్రేలియా జలాంతర్గాముల ఒప్పందంతో వివాదం
- అమెరికా సబ్‌మెరీన్‌ల కోసం ఫ్రాన్స్ డీల్‌ను రద్దు చేసిన ఆసీస్
- ఆస్ట్రేలియా, అమెరికాలో ఫ్రెంచి రాయబారులు స్వదేశానికి
ఇలా చెప్పాపెట్టకుండా తమ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఫ్రాన్స్‌కు కోపం వచ్చింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా, అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే ఫ్రెంచి రాయబారులను స్వదేశానికి పిలిపించేసుకుంది. తమ ఆగ్రహం తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా ఈ రెండు దేశాల నుంచి ఫ్రెంచి రాయబారులు స్వదేశానికి తిరిగెళ్లిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి.
దీంతో ఫ్రాన్స్‌తో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకునేందుకు బ్రిటన్, అమెరికా ప్రయత్నిస్తున్నాయి. ఈ డీల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ఫ్రెంచి మిత్రులకు ఆందోళన అక్కర్లేదని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు ఫ్రెంచి ప్రభుత్వాన్ని ఆయన కోరినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ జరుగుతుందని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి గేబ్రియెల్ అట్టల్ తెలిపారు.