డిసెంబరు 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల.. తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్

ghmc eletions notification releases
  • ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు
  • ఈ నెల 21న పరిశీలన
  • డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు  
  • బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌ డిసెంబరు 1న జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈ రోజు విడుదల చేశారు. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రేపటి నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్థసారథి చెప్పారు.

ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుందని వివరించారు. ఈ నెల 21న వాటి పరిశీలన జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 తుది గడువు అని చెప్పారు.  డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ‌ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.  

2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 52.09 శాతం పరుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000  మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు.

మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని పనులు  పూర్తి చేసినట్లు చెప్పారు.
Go Back to Shorts
GHMC
GHMC Elections
Telangana
Hyderabad

More Telugu News