రాప్తాడులో పరిటాల శ్రీరామ్ అందుకే ఓడిపోయాడు!: వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- టీడీపీ నేతలు తాగునీరు, సాగునీరు అందించలేకపోయారు
- సునీత కారణంగా 25 వేల మంది వలస వెళ్లారు
- మీడియాతో మాట్లాడిన రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే
రాప్తాడులో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు పెద్దగా ఏమీ చేయలేకపోయారనీ, ఆమెకు ఎలాంటి విజన్ లేకపోవడమే అందుకు కారణమని వ్యాఖ్యానించారు. సునీత చుట్టూ ఉన్న అనుచరులు కూడా ఆమెను సరిగ్గా గైడ్ చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు సాగునీటి హక్కు ఉందనీ, వీటిలో ఒక్క ఎకరాకు సునీత నీళ్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు.
కనీసం పిల్లకాలువలను పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. పరిటాల విఫలమైన చోట్ల తాను సక్సెస్ అవుతానని ధీమా వ్యక్తం చేశారు. తన కోరిక మేరకే అనంతపురంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. అండగా ఉంటాననే తనకు ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. చంద్రబాబు ఇష్టానుసారం ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారనీ, అలాంటిది చంద్రబాబును మళ్లీ గెలిపించడానికి ప్రజలు ఏమైనా పిచ్చివాళ్లా? అని ప్రశ్నించారు