రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించి ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తరువాత, ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారనే విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. అదే విధంగా సెకండాఫ్ లో అజయ్ దేవగణ్ పాత్ర ఎంటరవుతుందనీ, ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని కూడా ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో .. అజయ్ దేవగణ్  పాత్ర  .. భగత్ సింగ్ లక్షణాలతో కూడినదిగా కనిపిస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సెకండాఫ్ లో దాదాపు అరగంట పాటు నడిచే ఎపిసోడ్ లో అజయ్ దేవగణ్ పాత్ర విశ్వరూపం కనిపిస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తు .. అజయ్ దేవగణ్ కనిపించేంతవరకూ ఒక ఎత్తు అనే విధంగా ఆయన పాత్రను రాజమౌళి డిజైన్ చేశాడని చెబుతున్నారు. 2002లో అజయ్ దేవగణ్ చేసిన 'ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్' ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో ఆయన యాక్షన్ చూసిన తరువాతనే రాజమౌళి ఈ పాత్రకి ఎంపిక చేసుకున్నారని  తెలుస్తోంది.