అమెరికా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. కందిరీగ విషంతో శక్తిమంతమైన యాంటీ బయాటిక్ తయారీ!
- మొండి బ్యాక్టీరియాను తుదముట్టిస్తున్న మందు
- కణజాలాలకు ప్రమాదం లేదంటున్న నిపుణులు
- మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఘనత
దక్షిణ అమెరికా ప్రాంతంలో కనిపించే పౌలిబియా పౌలిస్టా జాతికి చెందిన కందిరీగ విషం నుంచి శాస్త్రవేత్తలు యాంటీ బయాటిక్ గా పనిచేసే పెప్టైడ్ లను అభివృద్ధి చేశారు. సాధారణంగా ఈ విషం మనుషుల ప్రాణాలను తీస్తుంది. అయితే పలు పరిశోధనల అనంతరం కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపేలా శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. మానవ శరీరంలో శ్వాసకోశ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఈ పెప్టైడ్ 100 శాతం తుడిచిపెట్టేస్తుందని ఎంఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటి బయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియా సైతం దీనిముందు దిగదుడుపేనని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ యాంటి బయాటిక్ పెప్టైడ్ ను తొలుత ఎలుకలపై ప్రయోగించగా, నాలుగు రోజుల్లో బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయిందని తెలిపారు.