హిల్టన్ హోటల్ లో సీక్రెట్ కెమెరా... స్నానం చేస్తుంటే తీశారంటూ రూ. 700 కోట్లకు యువతి దావా!

ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో హోటల్స్ ను నిర్వహిస్తున్న హిల్టన్ వరల్డ్ వైడ్, న్యూయార్క్ హోటల్ లో స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి, తనను నగ్నంగా వీడియో తీసి పరువు పోగొట్టారని ఆరోపిస్తూ, ఓ యువతి రూ. 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 700 కోట్లు) దావా వేసింది. తాను షవర్ బాత్ చేస్తుంటే వీడియోను తీసి, ఆపై పోర్న్ సైట్లలో వీడియోను అప్ లోడ్ చేశారని ఆమె ఆరోపించింది.

లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తాను, బార్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లి 'హాంప్టన్ ఇన్ అండ్ సూట్స్'లో బస చేశానని, ఆ సమయంలో తనను పూర్తి నగ్నంగా వీడియో తీశారని 19 పేజీల దావాలో బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన జూలై 2015లో జరిగిందని, తన నగ్న దృశ్యాలు మూడేళ్ల తరువాత సెప్టెంబర్ 2018న పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె వాపోయింది.

తన మిత్రులు వీడియో చూసి, 'ఇది నువ్వేనా?' అని లింక్ పంపడంతో తాను షాక్ తిన్నానని చెప్పింది. దీంతో తాను పనిచేసే చోట, బంధువుల్లో పరువు పోయిందని, హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన హాంప్టన్ ఇన్ ప్రతినిధి, దీన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని, తమ హోటల్ లో ఎటువంటి రహస్య కెమెరాలు లేవని అన్నారు. తమ హోటల్ లో అతిథుల భద్రతకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
Go Back to Shorts
Hilton
New York
Nude
Secret Camera

More Telugu News