గజ్వేల్ నియోజకవర్గంలో ఓ కీలక నేత ఓడిపోనున్నారని, ఆ విషయాన్ని పోలీసులే తనకు చెప్పారని, అతని పేరును మాత్రం తాను చెప్పబోవడం లేదని కాంగ్రెస్ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల గజ్వేల్ కు వెళ్లానని గుర్తు చేసిన ఆయన, తన వాహనాన్ని పోలీసులు ఆపారని, ఆపై తనను కిందకు దిగాలని కోరి, తనతో సెల్ఫీలు తీసుకున్నారని చెప్పారు. ఆపై నియోజకవర్గంలో రాజకీయాలపై వారిని సమాచారం అడిగానని, పరిస్థితి ఎలా ఉందని అడిగితే, 'పోతారు సార్' అని సమాధానం వచ్చిందని, తనతో మాట్లాడిన వాళ్లలో ఓ ఉన్నతాధికారి కూడా ఉన్నారని లగడపాటి తెలిపారు.

అక్టోబర్ 28న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్నారని చెప్పిన లగడపాటి, వారు తనను గుర్తు పట్టరని అనుకున్నానని, కానీ గుర్తు పట్టి పలకరించారని చెప్పారు. గజ్వేల్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తరువాత తెలుపుతానని అన్నారు. కాగా, గజ్వేల్ లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లగడపాటి తన వ్యాఖ్యల్లో కేసీఆర్ పేరును ప్రస్తావించకపోయినా, ప్రజల్లో మాత్రం ఆయన గెలుపుపై కొత్త చర్చ మొదలైంది.