జగన్ పై దాడి జరిగిన తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి!: సీఎం చంద్రబాబు
- జగన్ పై దాడి జరిగింది ఎయిర్ పోర్ట్ లో
- ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది
- దీనికి సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ ది
జగన్ పై దాడి ఘటనను ఖండిస్తున్నానని, అయితే, దాడి జరిగిన తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. జగన్ పై దాడి జరిగింది ఎయిర్ పోర్ట్ లో అని, ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని, దీనికి సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ ది అని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత స్థానిక పోలీసులకు సీఐఎస్ఎఫ్ ఫిర్యాదు చేయాలని, అదే సమయంలో బాధితుడు, నిందితుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.ఈ సంఘటన జరిగిన తర్వాత బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు.
ఈ సంఘటన అనంతరం గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం, ఆ తర్వాత ఈ దాడి ఘటనను సీఎం కేసీఆర్, కేటీఆర్, పవన్ కల్యాణ్ ఖండించడం.. ఇవన్నీ చూస్తుంటే ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలై పోయిందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి అత్యున్నత సంస్థలు దేశంలో ఎప్పుడైనా ఇలా దుర్వినియోగమయ్యాయా? అని ప్రశ్నించారు.