సీఎస్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు

CM Chandrababu attends AP CS daughter wedding
  • ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్తె వివాహ వేడుక
  • హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం దంపతులు
  • నూతన వధూవరులు త్రైలోక్య, ప్రభాస్‌లను ఆశీర్వదించిన చంద్రబాబు
  • సీఎస్ సాయి ప్రసాద్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి. సాయి ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. హైదరాబాద్‌ శివార్లలోని జన్‌వాడలో ఉన్న ఆర్య కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివరాల్లోకి వెళితే, సీఎస్ సాయి ప్రసాద్ కుమార్తె త్రైలోక్య పావనికి, ప్రభాస్ వెంకట్‌తో బుధవారం వివాహం జరిగింది. ఈ వేడుకకు సతీసమేతంగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, నూతన దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులతో చంద్రబాబు దంపతులు కాసేపు ముచ్చటించారు. తమ కుమార్తె వివాహానికి విచ్చేసి ఆశీర్వదించినందుకు ముఖ్యమంత్రి దంపతులకు సాయి ప్రసాద్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

మత్స్యకారులు క్షేమం... సీఎం చంద్రబాబు హర్షం

కోనసీమ జిల్లా నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. పశ్చిమ బెంగాల్ తీరంలో వారు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా గుర్తించేందుకు నిరంతరం శ్రమించిన గాలింపు బృందాలకు, అధికార యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు.

కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఆగస్టు 3వ తేదీన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. మార్గమధ్యలో వారి బోటులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బోటు ఇంజిన్ పనిచేయకపోవడంతో, బలమైన గాలులకు అది దారి తప్పి పశ్చిమ బెంగాల్ తీరం వైపు కొట్టుకుపోయింది.

నిర్ణీత గడువు దాటినా మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించి, గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రులను పంపి గాలింపును పర్యవేక్షించడంతో పాటు, మూడుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

సీఎం ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు జరిపింది. మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండవచ్చనే అంచనాతో అక్కడి కోస్ట్ గార్డ్, శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఈ సమష్టి ప్రయత్నాలు ఫలించి, శంకర్‌పూర్ సమీపంలో బోటును, అందులోని ఏడుగురు జాలర్లను సురక్షితంగా గుర్తించారు.

మత్స్యకారుల ఆచూకీ లభించిన వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన వారిని తిరిగి స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


Advertisement
Chandrababu Naidu
G Sai Prasad
AP Chief Secretary daughter wedding
Nara Bhuvaneswari
Arya Convention Center Janwada
Andhra Pradesh CM News

More Telugu News