లాస్ వెగాస్ నరహంతకుడు స్టీఫెన్ పెడ్డాక్ ప్రియురాలు మరిలౌ డాన్లీని ఎఫ్బీఐ అధికారులు ఫిలిప్పీన్స్ కు రప్పించారు. పెడ్డాక్ గురించిన వివరాలతో పాటు, మతమార్పిడి, ఉగ్రవాద నేపథ్యాన్ని తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఒకసారి ఆమెతో ఫోన్ లో మాట్లాడి పలు వివరాలు సేకరించిన అధికారులు, ఈ సారి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నంలో మునిగారు. లాస్ వెగాస్ లోని మాండలే హోటల్ లో రూం తీసుకునేందుకు పెడ్డాక్ ఆమె గుర్తింపు పత్రాలనే వాడడం విశేషం.

అంతే కాకుండా ఫిలిప్పీన్స్ లోని ఆమె అకౌంట్ కు 65 లక్షల రూపాయలు పంపినట్టు ఎఫ్బీఐ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఎందుకు పంపాడు? అన్న విషయాలు కూడా ఆరాతీయనున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఆమెను పెడ్డాక్ ఫిలిప్పీన్స్ పంపాడా? అన్న వివరాలు తెలుసుకోనున్నారు. ఫిలిప్పీన్స్‌ లో పుట్టిన డాన్లీకి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉండగా, లాస్ వెగాస్‌ నరమేధానికి రెండు వారాల ముందు ఆమె ఫిలిప్పీన్స్‌ కి, అక్కడి నుంచి ఒకసారి హాంగ్ కాంగ్ కు వెళ్లి వచ్చారు. వీటన్నింటిపైనా ఎఫ్బీఐ అధికారులు కూపీ లాగనున్నారు.