ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు లంకె పెడుతూ ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి ప్రమాదకరం ఐసిస్ అని, రాష్ట్రానికి ప్రమాదకరం జగన్ అని అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న జగన్ లో నంద్యాల ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయం కనపడుతోందని అన్నారు. ఈ భయంతో నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఉపఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర అన్నారు.