రౌడీగా చెలామణి అవుతున్న వ్యక్తిని పరిగెత్తించి చితకబాదిన ఘటన చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో గాయపడిన రౌడీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని కుండ్రత్తూరు‌కు చెందిన గురురాజ్ అలియాస్ నందకుమార్(33) స్థానికంగా రౌడీగా చెలామణి అవుతున్నాడు. ఇతడి స్నేహితుల్లో ఒకడైన గాజా.. కండ్రత్తూరుకే చెందిన మెర్విన్ అనే వ్యక్తికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో గజా ఈ విషయాన్ని గురురాజ్‌కు చెప్పాడు. దీంతో గురురాజ్ ఫోన్‌లో మెర్విన్‌తో మాట్లాడాడు. డబ్బులు ఇవ్వకపోతే బాగుండదని హెచ్చరించాడు. అయితే శుక్రవారం గురురాజ్ పల్లావరంలోని ఓ దుకాణంలో టీ తాగుతున్న సమయంలో మాటువేసిన నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో అతడిపై దాడి చేశారు. దీంతో తప్పించునేందుకు గురురాజ్ వీధుల వెంట పరుగులు తీశాడు. ప్రత్యర్థులు వెంటబడి మరీ అతడిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన గురురాజ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.