ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. తాను తలచుకుంటే గంటల వ్యవధిలో టీడీపీ సర్కారును కూల్చేస్తానని వైసీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సింగిల్ వ్యాఖ్యతో ‘ఆకర్ష్’కు తెర లేపిన టీడీపీ... గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 19 మందిని లాగేసింది. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్ నాథ్ రెడ్డి నేడు టీడీపీలో చేరిపోతున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్న అమర్... గడచిన ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన సునాయాసంగానే విజయం సాధించారు.
అయితే వైసీపీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చిన అమర్... తన సొంత గూడు టీడీపీ వైపు చూశారు. అమర్ నాథ్ రెడ్డి రీఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి పార్టీ బెజవాడ భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో అమర్ టీడీపీలోకి చేరుతున్నట్లు దాదాపుగా రూడీ అయిపోయింది. అదే క్రమంలో చడీ చప్పుడు లేకుండా నిన్న సాయంత్రం టీడీపీ విశ్వసనీయ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చేసింది. దీని ప్రకారం, నేడు అమర్ నాథ్ రెడ్డి... పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న అమర్ నాథ్ రెడ్డి... మరికాసేపట్లో చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుస్తారని, నేటి రాత్రి 7 గంటల సమయంలో ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.