జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేశార‌ట‌. 2010లో ఎన్నిక‌ల సందర్భంగా ఆమె ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఇచ్చిన అఫిడ‌విట్ లో ఈ విధంగా పేర్కొన్నారు. బీహార్‌లో చెల‌రేగిన ప‌రీక్ష‌ల టాప‌ర్స్ స్కాంపై ఆరా తీస్తోన్న అధికారుల‌కు ఈ విష‌యాలు తెలిశాయి. ఈ స్కాంలో ఉషా సిన్హా పేరు కూడా విన‌ప‌డుతోంది. ఆమె ప్ర‌స్తుతం పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లో హిందీ డిపార్ట్మెంట్లో ప‌నిచేస్తున్నారు. అయితే, గతంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆమె ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు స‌మ‌ర్పించిన విద్యార్హ‌త స‌ర్టిఫికెట్లన్నీ న‌కిలీవేన‌ని తెలుస్తోంది. అఫిడ‌విట్‌లో ఆమె ఎనిమిదేళ్ల‌కే మెట్రిక్యులేష‌న్ పూర్తి చేసిన‌ట్లు, రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఒకే ఏడాదిలో పూర్తి చేసిన‌ట్లు పేర్కొన్నారు. అంతేగాక‌, అక్క‌డి అవధ్ యూనివర్సిటీ 1976లో ప్రారంభ‌మైతే, ఈ వ‌ర్సిటీ నుంచి ఉషా సిన్హా 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు పేర్కొన్నార‌ట‌. త‌న పీజీ అనంత‌రం తాను 23ఏళ్ల వ‌య‌సులోనే పీహెచ్‌డీ ప‌ట్టా పొందిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్గా ఉషా సిన్హా భర్త లోకేశ్వర్ ప్రసాద్ గతంలో పనిచేశారు. ఉషా సిన్హా పేర్కొన్న విద్యార్హ‌త‌లన్నీ న‌కిలీవేన‌ని తేల‌డం బీహార్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.