: ఆయన నన్ను 'పొట్టోడా' అని పిలిస్తే...నేను అతన్ని 'బండోడా' అనేవాణ్ణి!: అమితాబ్ బచ్చన్
40 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించి, భారత దేశ చలన చిత్ర చరిత్రలో తన కోసం ఓ పేజీ కేటాయించేలా చేసుకున్న సినిమా 'షోలే'. ఈ సినిమా రిలీజై 40 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. 'షోలే' సినిమా స్క్రిప్టు వినిపించినప్పుడు 'గబ్బర్ సింగ్' పాత్ర పోషిస్తానని దర్శకుడు రమేశ్ సిప్పీకి, సినీ రచయితలు సలీం-జావెద్ కు అమితాబ్ సూచించారట. అయితే ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన దర్శకుడు 'జై' పాత్ర పోషించాలని సూచించారట. 'గబ్బర్ సింగ్' పాత్రకు డానీ డెంజోంగ్ పాను తీసుకోవాలని భావించి ఆయనకు కధ వినిపించారట. ఆయన డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో అమ్జాద్ ఖాన్ ను సంప్రదించారట.
దీంతో, 'గబ్బర్ సింగ్' పాత్రకు అమ్జాద్ ఖాన్ ను సలీం-జావెద్ సూచించారని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అమ్జాద్ టాలెంట్ పై చాలా మందికి అనుమానం ఉండేదని, తనకు మాత్రం డౌట్ లేదని, అందరి అంచనాలను ఆయన పటాపంచలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అమ్జాద్ ను చూసి అందరూ భయపడేవారని, అంతలా ఆయన ఆ పాత్రలో నటించారని బిగ్ బీ చెప్పారు. అప్పట్లో అమ్జాద్ ఖాన్ తనను సరదాగా 'పొట్టోడా' అని పిలిచేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఆయనను 'బండోడా' అని పిలిచేవాడినని ఆయన తెలిపారు.