న్యాయస్ధానం విధించిన శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ పకడ్బందీ ప్లాన్ వేసింది. పదేళ్లలో 13 సార్లు గర్భం దాల్చింది. కానీ ఒక్క నలుసును కూడా కనలేదు. వివరాల్లోకి వెళ్తే... జంగ్ అనే మహిళ అవినీతికి పాల్పడిందని పోలీసులు అరెస్టు చేశారు. నేరం నిరూపణ కావడంతో అదే ఏడాది అక్టోబర్ లో నార్త్ వెస్ట్ చైనాలోని ఉరుంఖి ఇంటర్మీడియట్ ప్రజా న్యాయస్ధానం ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో, జైలుకు వెళ్లక తప్పదని నిర్ధారణకు వచ్చిన జంగ్ తాను గర్భవతినని న్యాయస్దానానికి తెలిపింది. దీంతో పరీక్షలకు పంపిన న్యాయస్ధానం, నిజమే అని నిర్ధారణ కావడంతో డెలివరీ అనంతరం శిక్ష అమలు చేయాలని భావించి కేసును పెండింగ్ లో పెట్టింది.
తరువాత శిక్ష అమలు చేసేందుకు న్యాయస్థానం సన్నద్ధం కాగా, మళ్లీ తాను గర్భతినని న్యాయస్థానానికి తెలిపింది. ఇలా ఆమె 14 సార్లు న్యాయస్థానానికి గర్భవతినని చెప్పింది. అయితే 13 సార్లు ఆమె నిజంగానే గర్భందాల్చగా, ఒకసారి మాత్రం ఆమె అబద్ధం చెప్పింది. న్యాయస్థానం కోసం గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం పూర్తి కాగానే రిపోర్టులు న్యాయస్థానానికి ఇచ్చి, ఆ వెంటనే అబార్షన్ చేయించుకునేది. కాగా, ప్రస్తుతం 39 ఏళ్లున్న జంగ్ ను న్యాయస్థానం ఎట్టకేలకు జైలుకు పంపింది.