ముంబైకి చెందిన టీనేజ్ బాలిక (15) తన కథను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అది నెటిజన్లను ఆకర్షించింది. 3,200కు పైగా షేర్లు వచ్చాయి. ఇద్దరు పిల్లలున్న, విడాకులు తీసుకున్న వ్యక్తికి తననిచ్చి వివాహం చేసేందుకు పెద్దలు చేసిన ప్రయత్నాలను తానెలా తిప్పికొట్టానన్న విషయాన్ని ఆ బాలిక నలుగురితో పంచుకోవడమే ఇందుకు కారణం. పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు చెబుతూ, తన ఆశయాలను వివరిస్తే, వందలాది మంది అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తన తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేశారని, తాను ఆ వ్యక్తిని చూశానని, పెళ్లి చేసుకునే సమస్యే లేదని తేల్చి చెప్పానని ఆ బాలిక వివరించింది. పెళ్లి ప్రయత్నాలు ఆపకుంటే, ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించానని, 15 ఏళ్ల వయసులో తాను ఇద్దరు పిల్లలకు తల్లిగా ఎలా ఉండగలనని ప్రశ్నించానని చెప్పింది. తానింకా చదువుకోవాలని, ఐపీఎస్ అధికారిణి కావాలన్నది తన లక్ష్యమని, దాన్ని నెరవేర్చుకునే వరకూ ఆగనని స్పష్టం చేసింది. ఈ అమ్మాయి ఫేస్ బుక్ పోస్టు పలువురికి స్ఫూర్తినిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.