టీ టీడీఎల్పీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి ఉదయం ఓటుకు నోటు కేసు విచారణ నిమిత్తం హైదరాబాదులోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘ఉన్న పార్టీని వీడిది లేదు. కేసీఆర్ ను వదిలేది లేదు’’ అని ఆయన ప్రకటించారు.
కేసుకు సంబంధించి కేసీఆర్ సర్కారుతో పోరు సాగిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. కేసుకు సంబంధించి చార్జీషీటు దాఖలు చేస్తే కాని ప్రభుత్వ కుట్రలు వెలికి రావని ఆయన పేర్కొన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేసుపై మీడియా సంధించిన మరిన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని ప్రకటించిన ఆయన, ప్రభుత్వ కుట్రలపై పోరులో మాత్రం వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పారు.