స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానిస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో వెనువెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలు, జనసమ్మర్ధంగా ఉండే షాపింగ్ మాల్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఐబీ హెచ్చరించింది. అంతేకాక సముద్ర, వాయు మార్గాల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నంచే అవకాశాలున్నట్లు తెలిపింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు, తమిళనాడు రాజధాని చెన్నై తదితర నగరాలతో పాటు దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసు భద్రత పెరిగింది. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు ఎయిర్ పోర్టులోకి సందర్శకులకు పాసుల జారీని నిలిపివేశారు.