తనను వేధింపులకు గురిచేస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ యువతిపై కాల్పులకు దిగారు కొందరు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కొత్వాలీ మలాన్ జిల్లా పరిధిలోని సెంధారిలో జరిగింది. ఇంటి పనులు ముగించుకుని ఆరు బయట కూర్చున్న యువతి వద్దకు సునీల్ అనే వ్యక్తి, మరో ముగ్గురితో కలసి వచ్చాడు. ఆ యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. వారిని ఆమె ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న తుపాకిని తీసి సునీల్ కాల్పులు జరిపాడు. బులెట్లు తగిలి ఆ యువతి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని వివరించారు.