శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తాచాటారు. కెప్టెన్ అంచనాలకు అనుగుణంగా రాణించి శ్రీలంక పతనాన్ని శాసించారు. నిప్పులు చెరిగే బంతులతో ఆది నుంచి శ్రీలంక బ్యాట్స్ మన్ పై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బౌలర్లు లంకేయులను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. దీంతో కేవలం 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంక జట్టును మాధ్యూస్, చండిమాల్ అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. అయితే వారిద్దరూ అవుట్ కావడంతో శ్రీలంక జట్టు స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాటపట్టింది.
శ్రీలంక ఆటగాళ్లలో కరుణ రత్నే (9), సిల్వా(5), తిరుమన్నె (13), సంగక్కర (5), మాధ్యూస్ (64), చండిమాల్ (59), రంగన హెరాత్ (23) ముబారక్, దమ్మిక ప్రసాద్, కుశాల్ డకౌట్ గా వెనుదిరగగా, పరుగులేమీ చేయని ప్రదీప్ నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి రాణించగా, రెండు వికెట్లతో మిశ్రా, చెరో వికెట్ తో వరుణ్ ఆరోణ్, ఇషాంత్ శర్మ అతనికి చక్కని సహకారమందించారు. దీంతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 49.3 ఓవర్లు మాత్రమే ఆడిన శ్రీలంక 183 పరుగులు చేయడం విశేషం.