కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కల్యాణ్ ను కలిసిన చిన్నారి శ్రీజ
బ్రెయిన్ ఫీవర్ కారణంగా మృత్యుముఖం వరకు వెళ్లి కోలుకున్న ఖమ్మం బాలిక శ్రీజ గురించి తెలిసిందే. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తనకు హీరో పవన్ కల్యాణ్ ను చూడాలని ఉందనడం, ఈ విషయం తెలిసి పవర్ స్టార్ ఖమ్మం వెళ్లి ఆ అమ్మాయిని పరామర్శించడం మీడియాలో విశేషంగా ప్రసారమైంది. శ్రీజ బ్రెయిన్ ఫీవర్ నుంచి కోలుకుని పూర్ణ ఆరోగ్యాన్ని పొందింది. తాజాగా, తాను ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు ఓదార్చిన హీరో పవన్ కల్యాణ్ కు ఆ చిన్నారి తన కుటుంబంతో వచ్చి కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాదులోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి శ్రీజ తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి, సోదరి షర్మిలతో కలిసి ఈ ఉదయం వచ్చింది. వారితో పవన్ ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీజ కుటుంబం ముక్తకంఠంతో పవన్ కు థ్యాంక్స్ చెప్పింది. ఆయనను కలవడం సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పవన్... శ్రీజకు పళ్ల బుట్టను కానుకగా అందించాడు. అనంతరం కారు వరకు వచ్చి వారిని సాగనంపాడు.