రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ లోని పర్వతాలలో కూలిపోయిన జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కాక్ పిట్ లో ఉండాల్సిన ఒక పైలట్ క్యాబిన్ లో చిక్కుకుపోయాడట. ఈ విషయం కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో రికార్డయిందని విచారణ అధికారి ఒకరు తెలిపారు. విమానం వేగంగా కిందకు పడిపోతుండటంతో ఆ పైలెట్ కాక్ పిట్ లోకి తిరిగి వెళ్ళలేకపోయాడని వివరించారు. బార్సిలోనా నుంచి బయలుదేరిన తరువాత ఇద్దరు పైలట్ల మధ్య ఆహ్లాదకర సంభాషణ సాగిందని, ఆపై ఒక పైలట్ బయటకు వెళ్ళాడని, ఆ తర్వాత తిరిగి వచ్చినట్టు రికార్డ్ కాలేదని పేర్కొన్నారు. బయట ఉన్న పైలట్ కాక్ పిట్ తలుపును తొలుత నెమ్మదిగా, ఆపై గట్టిగా కొడుతున్న శబ్దాలు వినిపించాయని తెలిపారు. రెండో పైలట్ కు తలుపు తీసే సమయం కూడా లేకపోయిందని ఆయన అన్నారు. ఈ ఘటన విమానం కూలిపోయేందుకు క్షణాల ముందు జరిగిందని తెలిపారు.