వరల్డ్ కప్ చివరి క్వార్టర్ ఫైనల్ లో 394 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (3) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన కరీబియన్లకు ఆరో ఓవర్ లో లెండిల్ సిమ్మన్స్ (12) ఔట్ చేసి కివీస్ బౌలర్లు షాకిచ్చారు. దీంతో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సుడిగాలి క్రిస్ గేల్ (36) తో కలిసి మార్లన్ శామ్యూల్స్ (27) కష్టాల్లో పడ్డ జట్టును ఒడ్డున వేసే బాధ్యత తీసుకున్నాడు. అంతకుముందు కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ వీరవిహారంతో బెంబేలెత్తిపోయిన కరీబియన్లు, గేల్ గాడిలో పడాలని దేవుడిని ప్రార్ధిస్తూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో గేల్ ఆచితూచి ఆడుతూనే భారీ షాట్లు కొడుతున్నాడు. 9 ఓవర్లు ముగిసేసరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.