'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని నిర్మాత, నటుడు నాగబాబు తెలిపారు. హైదరాబాదులోని ఎఫ్ఎన్ సీసీ లో నాగబాబు, శివాజీరాజా, శ్రీరామ్ తదితరులు రాజేంద్రప్రసాద్ కు మద్దతుగా మాట్లాడారు. 'మా' అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వారు సూచించారు. రాజేంద్రప్రసాద్ సినీ కుటుంబానికి ఆత్మీయుడని, 'మా' అధ్యక్షుడిగా సేవ చేస్తానంటూ ముందుకు వస్తున్నారని, ఆయనకు మద్దతు పలుకుదామని నాగబాబు అన్నారు. ఆయనకున్న సీనియారిటీకి, అనుభవానికి ఎప్పుడో 'మా' అధ్యక్షుడయ్యుండేవారని పేర్కొన్నారు. 'మా' అధ్యక్షుడు అంటే అధికారం అనుభవించే పదవి కాదని, సేవ చేసేదని ఆయన చెప్పారు. 'మా'కు అధ్యక్షులుగా పని చేసిన వారు చాలా సేవ చేశారని, ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించేందుకు సరైన వ్యక్తిని ఎన్నుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
'మా' అధ్యక్షులుగా కొత్త వ్యక్తిని ఎన్నుకుందామని ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ గారు సూచించడంతో రాజేంద్రప్రసాద్ ను సమర్ధుడిగా భావిస్తున్నామని శివాజీరాజా తెలిపారు. సుమారు 50 మంది పేద కళాకారులకు పింఛను ఇస్తానని, మరో 50 మందికి పైగా పేద కళాకారుల ఇన్సూరెన్స్ ఖర్చును భరిస్తానని రాజేంద్రప్రసాద్ మాట ఇచ్చారని, అంతకంటే ఎక్కువ సేవ చేయాలని ఎవరైనా ముందుకు వస్తే వారిని స్వాగతిస్తామని అన్నారు.