జన్మనిచ్చిన తల్లిదండ్రుల మంచిచెడ్డలను ప్రతి ఒక్కరూ పట్టించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి యోగక్షేమాలను గాలికి వదిలేసిన ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి, తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ మంచిగా చూసుకునే విధంగా తాను చర్యలు తీసుకుంటానని... జన్మనిచ్చిన వారి యోగక్షేమాలు చూసేలా ఒత్తిడి చేస్తానని చెప్పారు. అయినా పట్టించుకోని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారికి పెన్షన్లు రాకుండా చేస్తామని అన్నారు. బిడ్డల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రుల సహాయార్థం చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.