ఇంతకుముందు జరిగిన విదేశీ పర్యటనల్లో భారత్ ప్రాక్టీసు మ్యాచ్ లలో సైతం తడబాటుకు గురైన సందర్భాలు ఎన్నో. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా సానుకూల దృక్పథంతో ఆరంభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో అడిలైడ్ లో జరిగిన రెండ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో అటు బౌలింగ్ లోనూ, ఇటు, బ్యాటింగ్ లోనూ రాణించింది. మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత ఆటగాళ్లకు మెరుగైన ప్రాక్టీస్ లభించింది. తొలి ఇన్నింగ్స్ లో సీఏ జట్టును 219 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా... అనంతరం, 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్ విజయ్ 51, పుజారా 55, కోహ్లీ 60, రైనా 44, సాహా 56*, కర్ణ్ శర్మ 52* పరుగులు చేశారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 4న ఆరంభం కానుంది.