శంషాబాద్ దేశీయ టెర్మినల్ కు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సమయంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్ పేరు ఉండేదని, కానీ వైఎస్ ప్రభుత్వం ఆ పేరును మార్చి తప్పు చేసిందన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్ కు మర్చినప్పుడు రాజీవ్ పేరు పెట్టారన్నారు. ముమ్మాటికీ ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని కిషన్ బల్లగుద్ది చెప్పారు. ఇక ఎన్టీఆర్ వద్దే జానారెడ్డి, జీవన్ రెడ్డి రాజకీయాలు నేర్చుకున్నారన్నారు. మన రాష్ట్రంలో అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లే పెట్టి కొమరం భీం వంటి ప్రముఖుల పేర్లు ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ఇలా అన్నిటికీ కాంగ్రెస్సే పేర్లు మార్చుకుంటూ వచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. కుటుంబ సభ్యులను తప్ప దేశంలోని గొప్ప వ్యక్తులను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ఆ పార్టీకి భావదారిద్ర్యం ఉందని విమర్శించారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కిషన్ రెడ్డి తెలిపారు. పీవీ నరసింహారావు, కొమరం భీం పేర్లు పరిశీలించాలని కేంద్రాన్ని కోరదామన్నారు.