అతడి పేరు అజయ్ కుమార్ (21). బాగా చదువుకున్నవాడు. భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఎన్ఐటీ)లో మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని, ప్రస్తుతం దుర్గాపూర్ లో ఎంటెక్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూ నిమిత్తం భోపాల్ వచ్చిన అజయ్ కుమార్ మిత్రుడి వద్ద షెల్టర్ తీసుకున్నాడు. గురువారం నాడు తప్పతాగి నేరుగా ఎంఏఎన్ఐటీ క్యాంపస్ కు వెళ్లాడు. అక్కడ అమ్మాయిల హాస్టల్లోని స్టడీ లాంజ్ లో ప్రవేశించి నానాయాగీ చేయసాగాడు. దీంతో, విద్యార్థినులు బెంబేలెత్తిపోయారట ఆ ఉన్నత విద్యావంతుడి విపరీత చేష్టలకు. ఓ అమ్మాయి హాస్టల్ వార్డెన్ కు సమాచారమందించడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, పోలీసులు అజయ్ కుమార్ ను అరెస్టు చేశారు. అతడికింకా కిక్కు దిగలేదని, అమ్మాయిల హాస్టల్ కు ఎందుకు వెళ్లాడో చెప్పలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు.