మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 5.55 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్ 12వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1935, ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడులో జనార్ధన్ రెడ్డి జన్మించారు. మొత్తం మూడుసార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. 1972 లో రాజ్యసభ సభ్యుడిగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో శాసనమండలి సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. 1978-1983, 1989-1990 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా; 1988, 1989 లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడుగా ఆయన పనిచేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ 2007లో నేదురుమల్లికి డాక్టరేట్ ప్రధానం చేసింది. 2007 సెప్టెంబర్లో నెల్లూరుకు సమీపంలో జరిగిన నక్సల్స్ దాడి నుంచి భార్య రాజ్యలక్ష్మి సహా జనార్ధన్ రెడ్డి బయటపడ్డారు. నేదురుమల్లి దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. 2009లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు.