ఇప్పుడు త్రీడీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. దీంతో దేన్నైనా ముద్రించేయవచ్చు. శరీరానికి అవసరమైన కొత్త అవయవాలను కూడా ముద్రించేసి, చక్కగా మన శరీరంలో అమర్చుకోవచ్చు. ఇలా కొత్త కొత్త పోకడలకు దారితీస్తున్న త్రీడీ పరిజ్ఞానం చక్కగా మనిషిని కూడా ముద్రించేలా అభివృద్ధి చెందుతోంది. త్రీడీ పరిజ్ఞానం సెల్‌ఫోన్లకు పాకి ఇవి చక్కగా అవతలి వారి త్రీడీ ఇమేజ్‌ని మన కళ్లముందుకు తీసుకురానున్నాయి.

సెల్‌ఫోన్ల టెక్నాలజీతో ఇప్పుడు త్రీడీ పరిజ్ఞానం కూడా తోడుకానుంది. ఇలాంటి త్రీడీ ఇమేజ్‌ (హోలోగ్రామ్‌) ఫోన్లు కూడా త్వరలోనే మన చేతిలోకి రానున్నాయి. ఈ ఫోన్లద్వారా ఎవరితోనైతే మనం మాట్లాడుతుంటామో సదరు వ్యక్తి మన పక్కనే వచ్చి నిల్చున్నట్టే ఉంటుంది. అంతేకాదు... సంభాషణ సమయంలో అవతలి వారి హావభావాలు, ముఖకవళికలు అన్నీ కూడా మన ఎదుట ప్రతిబింబంలో కూడా ప్రతిఫలిస్తుంటాయి. ఇలాంటి కొత్తరకం సెల్‌ఫోన్లు మనకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఫోన్ల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అవతలివారు మన పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

పోలెండ్‌కు చెందిన లీయా డిస్‌ప్లే సిస్టమ్స్‌ అనే టెలికాం కంపెనీవారు ఈ కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానంపై కసరత్తు జరుపుతున్నారు. ఈ కొత్తరకం టెక్నాలజీ మరో ఐదేళ్లకాలంలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఇందులో ఉండే హోలోగ్రామ్‌ యంత్రం అవతలి వ్యక్తి రూపాన్ని తీసుకుని నీటి ఆవిరితో కూడిన తెరపైకి త్రీడీ ప్రతిరూపంలో పంపిస్తుంది. ఈ ప్రతిరూపం మైక్రోఫోన్‌ సాయంతో మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి కదిలితే ఇది కూడా కదులుతుంది. దీంతో మనతో మాట్లాడే వ్యక్తి మన ఎదుటే ఉన్న భావన మనకు కలుగుతుంది. వచ్చే ఏడాది నాటికి తొలి హోలోగ్రాఫిక్‌ టెలీఫోన్‌ నమూనాను తయారుచేయాలని, మరో ఐదేళ్లకు పూర్తిస్థాయిలో దీన్ని మెరుగుపరచి మార్కెట్లోకి విడుదల చేయాలని లీయా డిస్‌ప్లే సంస్థ తమ లక్ష్యంగా నిర్దేశించుకుంది.