రాజ్యాంగ ప్రక్రియకు అడ్డుపడాలని సీమాంధ్రులు చూస్తున్నారని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ జీవోఎంను రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేశారని, రాష్ట్రపతి టైం నిర్దేశించారని, దానిని అడ్డుకునే పనులు వద్దని అన్నారు. రాష్ట్రపతి నిర్ణయించిన డేట్ తరువాత తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చి ఆమోదం పొందుతుందని అన్నారు. అసెంబ్లీలో అభిప్రాయం చెప్పే హక్కు ఉందని, దానిని ఉపయోగించుకోవాలని... అవసరమైతే కోర్టుకు వెళ్లండి అంటూ ఆయన సూచించారు.

ఈ మధ్య చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న జైపాల్ రెడ్డి... పంజాబ్- హర్యానా ఏర్పాటును అసెంబ్లీ చర్చకే పంపించలేదని ఆయన గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం తెలంగాణ బిల్లును ఇబ్బంది పెట్టేందుకేనని అయన మండిపడ్డారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఏవీ అడ్డుకోలేవని అన్నారు.

జనవరి 23వ తేదీ తరువాత అసెంబ్లీ చేయగలిగింది ఏదీ లేదని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి తొలి వారంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాల నేతలు బిల్లులో లోటుపాట్లు ఉంటే సూచించాలని అన్నారు. సీఎం ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల రెండు ప్రాంతాల ప్రజల్లో విద్వేషాలు రేగుతాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలమందరం కావాలనే ఆత్మనిగ్రహం పాటిస్తున్నామని... జనవరి 23 తరువాత చెబుతామని ఆయన హెచ్చరించారు.