జీవితంలో బోలెడన్ని సమస్యలతో సతమతమయ్యేవారు ఒక్కసారి చచ్చి మళ్లీ పుడితే సమస్యలు దూరమవుతాయట. అదేంటి, చచ్చిన తర్వాత మనిషిగానే పుడతామనే నమ్మకం ఏంటి... అనేదేగా మీ సందేహం. అయితే, ఇది నిజం చావు కాదు లెండి... ఉత్తుత్తి చావు! పెట్టెలో పడుకొని చచ్చినట్టు భావిస్తే ... పెట్టె మూత తెరిచిన తర్వాత మళ్లీ పుట్టినట్టే ఫీలవుతామని అంటున్నారు. అందుకే పెట్టెలో చావడానికి ఇప్పుడు చాలామంది సిద్ధపడుతున్నారు. చైనాలోని ఒక సైకోథెరపీ సెంటరు తమ సెంటరుకు వచ్చే కస్టమర్ల కోసం ఇలాంటి ఒక సరికొత్త ట్రీట్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే పెట్టెలో పునర్జన్మ!

జీవితంలో విపరీతమైన మానసిక సమస్యలకు లోనై జన్మ చాలించి మరో జన్మ ఎత్తితే బాగుండు... అనుకునే కస్టమర్ల కోసం పునర్జన్మ పేరుతో కొత్త రకం ట్రీట్‌మెంట్‌ ఇస్తోంది. ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకునేవారు తమ చివరి కోరిక ఏమిటి? అనేది ఒక కాగితంపై రాసి సమాధి పెట్టెలో పడుకోవాలి. తర్వాత పెట్టెను మూసేసి పెట్టెపైన తెల్లని వస్త్రం కప్పేస్తారు.

ఒక ఐదు నిమిషాల పాటు ప్రార్థనలు చేసి వినిపించి, తర్వాత పసికందు ఏడుపు వినిపించి సమాధి మూత తెరిచి కస్టమర్‌ను నిద్ర లేపుతారు. ఇలాంటి ట్రీట్‌మెంట్‌తో కస్టమర్‌ తాను చనిపోయి తిరిగి జన్మించినట్టు ఫీలవుతాడట. దీంతో అప్పటి వరకూ సదరు కస్టమరును వేధించిన మానసిక సమస్యలు కూడా మాయమవుతాయని చెబుతున్నారు. ఏ పెట్టెలో ఏ జన్మ వుందో... ఎవరికి తెలుసు మరి!