కళ్లు బోలెడన్ని విషయాలను చెబుతాయి. అదే కళ్లు మనల్ని బాధపెట్టిన వారిని కూడా పట్టిస్తాయట. కళ్లపై ఉన్న దుర్మార్గుల బొమ్మలను చూడగానే తమపై దాడికి పాల్పడిన వారు ఫలానా వారనే కచ్చితంగా బాధితులు గుర్తిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. డిజిటల్‌ ఫోటోగ్రఫీలో ఒక సరికొత్త టెక్నిక్‌తో నిస్సహాయులపై దాడికి పాల్పడిన వారిని పట్టేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గోకు చెందిన పరిశోధకులు డిజిటల్‌ ఫోటోగ్రఫీలో ఒక సరికొత్త టెక్నిక్‌ను కనుగొన్నారు. ఈ టెక్నిక్‌తో మహిళలు, పిల్లలు, నిస్సహాయులైన ఇతరులపై దాడిచేసి నేరాలకు పాల్పడేవారిని, బాధితుల కనుపాపల్లోని ప్రతిబింబాల ఆధారంగా తేలిగ్గా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనా బృందానికి సారధ్యం వహించిన రాబ్‌ జెన్‌కిన్స్‌ మాట్లాడుతూ తాము కనుగొన్న ఈ కొత్త టెక్నిక్‌తో చాలా కచ్చితత్వంతో అనుమానితులను గుర్తించినట్టు చెబుతున్నారు.

మహిళలపై, పిల్లలపైనా లైంగిక దాడులకు పాల్పడుతున్నప్పుడు లేదా ఎవరినైనా బందీలుగా పట్టుకున్నప్పుడు తీసిన బాధితుల ఫోటోలు, కెమెరా రికార్డింగుల ఆధారంగా వారి కళ్లలోని ప్రతిబింబాలను ఈ పద్ధతిలో గుర్తించవచ్చని చెబుతున్నారు. బాధితుల ముఖం ఫోటోలను బాగా జూమ్‌ చేసి వారి ముఖంకన్నా కూడా ముఫ్ఫైవేల రెట్లు చిన్నగా కళ్లలో ఉండే ప్రతిబింబాన్ని చూడవచ్చని, కొంతమందిపై ఈ టెక్నిక్‌ను ఉపయోగించగా తమపై దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను 71 శాతం కచ్చితత్వంతోను, తెలిసిన వారిని 84 శాతం కచ్చితత్వంతోను గుర్తించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.

మనిషి కంటిపాప ఒక నల్లటి అద్దం లాంటిదని, దాని ఫోటోలను జూమ్‌ చేసి హై రెసొల్యూషన్‌ ప్రతిబింబాలను చూడవచ్చని, నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్‌ ఆధారంగా ఈ టెక్నిక్‌ చక్కగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.