యోగలక్ష్మికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా .. 'హార్ట్ బీట్' సిరీస్ లో ఆమె చేసిన పాత్రలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 'హార్ట్ బీట్'లో యోగలక్ష్మి చేసింది నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర. అయినప్పటికీ ఆకర్షణీయమైన ఆమె కళ్లు అందరినీ కట్టిపడేశాయి. అలాంటి యోగలక్ష్మి ప్రధానమైన పాత్రగా రూపొందిన సిరీస్ గా 'ది కోర్ట్' కనిపిస్తుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ నుంచి ఇంతవరకూ 16 ఎపిసోడ్స్ ను వదిలారు. తెలుగులోను అందుబాటులో ఉన్నాయి.
'యాలిని' (యోగలక్ష్మీ) 'లా' పూర్తి చేస్తుంది. సిటీకి చేరుకుని అక్కడ తన స్నేహితులు ఉండే పీజీలో దిగుతుంది. హైకోర్టులో జూనియర్ గా అవకాశాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు మొదలెడుతుంది. 'బార్' ఎలక్షన్స్ దగ్గర పడటంతో, హై కోర్టులో సీనియర్ న్యాయవాదుల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనకి ఛాంబర్ లేకుండా చేసిన 'వేణి చంద్రకాంత్' (ముక్తా జార్జ్) పై అడ్వకేట్ దేవా ( అర్జున్ శ్యామ్) అసహనంతో ఉంటాడు. ఆమె ఛాంబర్ ను షేర్ చేసుకోవాలనే పట్టుదలతో ఉంటాడు.
'వేణి' ఆ కోర్టులో 15 ఏళ్లుగా అడ్వకేట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ముత్తు .. విశ్వ .. కీర్తన జూనియర్స్ గా ఉంటారు. ఆ కోర్టుకి సంబంధించిన క్యాంటీన్ ను వేణి భర్త 'సత్య' నడుపుతూ ఉంటాడు. ఆ కోర్టు ఆవరణలో ఎవరు అడుగుపెట్టినా క్యాంటీన్ నడుపుతున్న సత్యకి .. 'టీ'లు మోసే 'సుడాలి'కి తెలిసిపోతుంది. అందువలన ఆ కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టిన 'యాలిని'కి ముందుగా వాళ్లే తారసపడతారు. అలాంటి ఒక తెలివైన అమ్మాయి, వేణికి జూనియర్ గా ఉంటే బాగుంటుందని సత్య భావిస్తాడు.
అయితే దేవాకి జూనియర్ గా 'యాలిని' చేరిపోతుంది. అప్పటికే దేవాకి 'దివి' అనే ఓ పదేళ్ల కూతురు ఉంటుంది. ఆమె తల్లిని గురించి అడిగే సాహసం చేయలేకపోతుంది యాలిని. ఆమె ధోరణి వేణి జూనియర్స్ ను తీవ్రమైన అసహనానికి గురిచేస్తుంది. సమయం చూసి యాలినిని దెబ్బకొట్టాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? యాలిని ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? ఆమె తీసుకునే కేసులు ఎలాంటి సవాళ్లను విసురుతాయి? అనేది మిగతా కథ.
'జియో హాట్ స్టార్' నుంచి వచ్చిన 'హార్ట్ బీట్' హాస్పిటల్ నేపథ్యంలో .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన సిరీస్ గా 'ఆఫీస్' కనిపిస్తుంది. ఒక విలేజ్ నేపథ్యంలో తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సిరీస్ కూడా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో వదిలిన మరో సిరీస్ 'ది కోర్ట్'. కోర్టు బయట .. లోపల చోటుచేసుకునే సన్నివేశాలతో నడిచే సిరీస్ ఇది.
యాలిని కొత్తగా కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టడం .. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం .. తన తెలివి తేటలతో జూనియర్ గా అవకాశాన్ని సంపాదించడం .. సీనియర్స్ మధ్యనున్న స్పర్థలను గమనించడం .. అమాయకంగా ఉంటే తన క్రెడిట్ ను కొట్టేయడానికి అవతలవాళ్లు ఆలోచించరనే విషయాన్ని పసిగట్టడం .. ధైర్యంగా ఆ సమస్యను అధిగమించడం వంటి సన్నివేశాలతో ఈ సిరీస్ ముందుకు వెళుతుంది.
ప్రధానమైన పాత్రల సంఖ్య .. అందుకు సంబంధించిన ట్రాకులు చూస్తే, ఇది చాలా భారీ సిరీస్ అనే విషయం అర్థమవుతుంది. అయితే కథను యెత్తుకున్న విధానం .. కొన్ని ఎపిసోడ్స్ వరకూ ఆ పాత్రలను నడిపించిన తీరు సాదాసీదాగానే అనిపిస్తుంది. ఆరంభంలోని ఎపిసోడ్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు వెళ్లని కారణంగా, కోర్టులో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సన్నివేశాలు అంత బలంగా అనిపించనూ లేదు.
అయితే 'యాలిని' పాత్ర వెనుక కూడా బలమైన కథ ఏదో ఉందనే విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది. అలాగే వేణి భర్త క్యాంటీన్ కి ఎందుకు పరిమితమయ్యాడనే ఒక సందేహం తలెత్తుతుంది. ఇక దేవా ఫ్యామిలీ లైఫ్ లోని చిక్కులు ఎలాంటివి అనేది కూడా కుతూహలాన్ని పెంచుతుంది. ఇలా ప్రధానమైన పాత్రలకు సంబంధించిన నేపథ్యాలు ఆడియన్స్ ముందుకు ఇంకా రాలేదు. అలాగే మరికొన్ని కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.
భారీ తారాగణంతో రూపొందిన ఈ సిరీస్ నుంచి ఇంకా చాలా ఎపిసోడ్స్ రావలసి ఉండొచ్చు. కానీ ఆరంభంలో ఎపిసోడ్స్ ఆ దిశగా నడిపించేవి అయ్యుండాలి. ఒక ఎపిసోడ్ ను మించి మరొక ఎపిసోడ్ ఉత్కంఠను రేకెత్తించాలి. కానీ ఈ సిరీస్ కథ చాలా నిదానంగా .. నింపాదిగా మొదలవడం కాస్త నిరాశను కలిగిస్తుంది. సరైన కేసులు .. యాలిని తన తెలివి తేటలతో వాటిని పరిష్కరించే విధానానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ త్వరలో పలకరించవచ్చు. అలా కథ పుంజుకుంటే ఈ సిరీస్ కూడా ఒక 'హార్ట్ బీట్' .. ' ఆఫీస్' సిరీస్ ల సరసన చేరే ఛాన్స్ ఉంది.
'ది కోర్ట్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
The Court Review
Movie Details
Movie Name: The Court
Genre: Drama
Release Date: 2026-09-04
Cast: Yogalakshmi, Jayaprakash, Arjun Syam, Gopan Magalakshmi, Sudarsanan, Muktha George, Vivek Prasanna
Director: Bala SB
PRO: -
Music: Rashaanth Arwin
Banner: A Tele Factory
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer