హిందీ నుంచి ఓ భారీ హారర్ కామెడీ థ్రిల్లర్ రీసెంటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సిరీస్ పేరే 'అలీబాబా ఔర్ 40 భూత్'. ఆశా నేగి - విశాల్ వశిష్ఠ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, కోణార్క్ ముఖర్జీ ... రిషవ్ అగర్వాల్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. వారానికి 4 ఎపిసోడ్స్ చొప్పున వదులుతున్నారు. ఇంతవరకూ 16 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. 

కథలోకి వెళితే .. అది 'జూలియా' అనే ప్రాంతం. అక్కడ 'తపీష్' (ఉజ్వల్ చోప్రా) నివసిస్తూ ఉంటాడు. చాలా కాలంగా ఆయన పురావస్తు శాఖలో పనిచేస్తూ ఉంటాడు. వేరే ప్రాంతాలలో ఉంటున్న పెద్ద కూతురుకుగానీ .. చిన్నకూతురు 'అలీషా' (ఆశా నేగి)కిగాని ఆయన నుంచి కొన్ని రోజులుగా కాల్స్ వెళ్లవు. ఆయన నుంచి అలీషాకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుందిగానీ ఆమెకి అర్థం కాదు. దాంతో ఆమె తన  తండ్రిని వెతుక్కుంటూ బంగ్లాకి వస్తుంది. అయితే చాలా రోజులుగా ఆయన ఇంటికి రాలేదనే విషయం ఆమెకి అర్థమవుతుంది. 

అలీషా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ 'బాబా' రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్ లో అతనికి సహకరించడం కోసం అలీషా అతని కూడానే ఉంటుంది. అదే సమయంలో అక్కడికి కాస్త దూరంగా ఉన్న 'తమోఘాటి' అనే ప్రాంతంలో, మహాదేశ్ అనే మాంత్రికుడు క్షుద్రపూజలు చేస్తుంటాడు. తన దైవమైన 'వక్రసింఘ' ఆగమనం కోసం అతను ఎదురుచూస్తుంటాడు. తన అనుచరులతో అతను కూడా తపీశ్ కోసం వెతికిస్తుంటాడు.

ఆ ఊళ్లో భూతాలు తిరుగుతున్నాయనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. మరో వైపున మేకలు చనిపోతూ ఉంటాయి .. మనుషులు హత్య చేయబడుతుంటారు. అలాంటి పరిస్థితులలో తపీశ్ సన్నిహితుడైన 'గిరి' నుంచి అలీషాకి కాల్ వస్తుంది. కొన్ని రోజుల క్రితం కొన్ని రహస్య వస్తువులు తవ్వకాలలో తపీశ్ కి లభించాయనీ, వాటి కారణంగా తపీశ్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతాడు. ఈ విషయాలు 'తల్వార్'కి  తెలియనీయవద్దని హెచ్చరిస్తాడు.

 అలీషా తన తండ్రికి దొరికిన రహస్య వస్తువులు ఏమై ఉంటాయి? వాటిని ఆ బంగ్లాలో ఆయన ఎక్కడ దాచి ఉంచి ఉంటాడు? అనేది 'బాబా'తో కలిసి అన్వేషించడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆలీషాకి తన ఇంట్లోని ఒక రహస్య గదిలో ఒక చిత్రమైన బొమ్మ కనిపిస్తుంది. పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ 'అనుభవ వర్మ' వలన, ఆ బొమ్మలకు ప్రేతాత్మలకు సంబంధం ఉందనే విషయం అర్థమవుతుంది. తన తన తండ్రి 'అప్సర' అనే పాడుబడిన థియేటర్ కి వెళ్లిన తరువాత కనిపించకుండా పోయాడని ఆమెకి స్పష్టమవుతుంది. దాంతో ముగ్గురూ కలిసి అక్కడికి వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ బొమ్మలకు .. ప్రేతాత్మలకు ఉన్న సంబంధం ఏమిటి? మాంత్రికుడైన మహాదేష్ ఉద్దేశం ఏమిటి? తపేశ్ ఏమైపోయాడు? అనేది మిగతా కథ.

'అలీ'షా .. పోలీస్ ఆఫీసర్ 'బాబా' .. బొమ్మలను  ఆవేశించిన 40 భూతాల కథ ఇది. పురావస్తు శాఖలో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో ఈ కథ మొదలవుతుంది. తన తండ్రి జాడ తెలుసుకోవడం కోసం కూతురు రంగంలోకి దిగడంతో ఈ కథ పుంజుకుంటుంది. క్షుద్ర పూజలు .. భూతాలు .. మాంత్రికులతో సంబంధాలున్న పెద్ద తలకాయలు .. వీటిని టచ్ చేస్తూ సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది.

సాధారణంగా ఒక క్షుద్రశక్తి మేల్కోవడం .. ఇక అది బయటికి వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేసే కథలు చాలా వరకూ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. ఈ తరహా కథలకు కామెడీ టచ్ ఇవ్వడం వలన, భయానికి దూరంగా వెళ్లి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా మారిపోతాయి. అలా ఆ కోణంలో  కామెడీ టచ్ కూడా ఇచ్చారు. కాకపోతే కథను సీరియస్ గా చెప్పడానికి తగిన ఫోకస్ పెట్టలేదని అనిపిస్తుంది.

పురావస్తు త్రవ్వకాలలో నలభై బొమ్మలు బయటపడటం దగ్గర నుంచి .. ప్రేతాత్మలను చూపించడం వరకూ కృతకంగానే అనిపిస్తుంది. బావిలో ప్రేతాత్మలు ఉండటానికి గల కారణాన్ని చెప్పే కథ సహజత్వానికి దగ్గరగానే కనిపిస్తుంది. 'వక్రాసింఘ'కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మాత్రంగా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. కాకపోతే గ్రాఫిక్ వర్క్ బాగానే అనిపిస్తుంది.

ఒక పురావస్తు శాఖకి సంబంధించిన సీనియర్ ఆఫీసర్ కనిపించకుండాపోతే అందుకు సంబంధించిన డిపార్టుమెంటు వైపు నుంచి ఎలా హడావిడి కనిపించదు. కూతురుతో పాటు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీస్ ఆఫీసర్స్ లోను ఎలాంటి కంగారు ఉండదు. ఇక భూతాలు .. హత్యల విషయంలో కూడా అంతే తాపీగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎం జరుగనుందా? అనే ఒక కుతూ హలాన్ని రేకెత్తించలేకపోయారు.

కథ .. స్క్రీన్ ప్లే అంత గొప్పగా ఏమీ అనిపించవు. ఫోటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. నటీనటుల నటన గురించి చెప్పుకునే స్థాయిలో పాత్రలను డిజైన్ చేయలేదనే చెప్పాలి. మొత్తం 40 ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు.అందుబాటులో ఉన్న 16 ఎపిసోడ్స్ ను బట్టి చూస్తే, కామెడీ పరంగా నవ్వించలేక .. ప్రేతాత్మలతో భయపెట్టలేకపోయిన సిరీస్ గానే చెప్పుకోవలసి ఉంటుంది.