'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా రివ్యూ

కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్‌ అబ్బవరం, నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్మాతగా ఆయన నిర్మించిన చిత్రం 'తిమ్మరాజుపల్లి టీవీ'. దాదాపుగా 40 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ, ముని అనే కొత్త దర్శకుడితో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కథేంటి? 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

90వ దశకంలో టీవీలు అంటే క్రేజీ ఉన్న సమయంలో తిమ్మరాజుపల్లి అనే ఊరిలో జరిగే కథ ఇది. శివరాత్రికి, పండగలు, జాతరలకు  విరాళాలు వేసుకుని ఆ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం, ఆ రోజు సాయంత్రమే అద్దెకు తెచ్చుకున్న టీవీ, వీసీఆర్‌ ప్లేయర్‌లో కొత్త సినిమాలు చూసి ఆనందించడం అక్కడి ఊర్లో జనాలకు అలవాటు, అలాంటి ఊరిలో తొలిసారిగా రాజప్ప (ప్రదీప్‌ కొట్టె) మొదటి టీవీని, డిష్‌ను కొనుక్కోంటాడు. కానీ  ఊర్లో అందరి కంటే ముందు టీవీ తనే కొనాలని అనుకున్న ఊరి పెద్ద రామచంద్రయ్య మాత్రం రాజప్ప మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఇక ఊరి జనాలంతా రోజు సాయంత్రం కాగానే రాజప్ప ఇంటికి వచ్చి టీవీ చూస్తుండటం మొదలుపెడతారు. 

 ఈ ఊరిలోనే ఉండే సతీష్‌ (సాయి తేజ్‌) రాజప్ప చెల్లెలు శారద (వేద జలంధర్‌)ను ప్రేమిస్తుంటాడు. టీవీ చూసే వంకతో రాజప్ప ఇంటికి వచ్చి ఆమె శారదాను చూస్తుంటాడు. వీరి ప్రేమయాణం గురించి రాజప్పకు తెలియడంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో 'నీ టీవీని లేకుండా చేస్తానని' సతీష్‌ సవాల్‌ చేసి వెళతాడు.    అదే రోజు రాజప్ప ఇంట్లో టీవీ చోరికి గురవుతుంది. దీంతో ఊరి ప్రజలందరూ సతీషే టీవీని దొంగతనం చేశాడని భావించి పంచాయితీలో రెండు వారాల  సమయంలో టీవీ తెచ్చి రాజప్ప ఇంట్లో అప్పగించాలని చెబుతారు. ఇక ఈ రెండు వారాల గడువులో సతీష్‌ ఏం చేశాడు? అసలు టీవీని దొంగతనం చేసింది ఎవరు? సతీష్‌ ఆ దొంగను ఎలా కనిపెట్టాడు ? అనేది మిగతా కథ 


80-90వ దశకంలో టీవీలు అంటే ఎంతో క్రేజ్‌.. టీవీ ఉన్న ఇల్లు అప్పట్లో అరుదుగా ఉండేది. ఇక పల్లెట్లూరిలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం వచ్చిదంటే చిత్రలహరి, శని, ఆదివారాలు సినిమాలు , వీసీడి ప్లేయర్‌లో సినిమాలు వేసుకోని చూడటం... అబ్బో టీవీతో అందరికి ఓ మంచి అనుబంధం. సరిగ్గా 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమాలో అందరికి ఇవే జ్క్షాపకాలను గుర్తు చేస్తూ తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఓ కథను అల్లుకున్నాడు దర్శకుడు ముని. అయితే ఈ సినిమా కథ చాలా సింపుల్‌ లైన్‌. ఓ టీవీ దొంగతనం దాని చుట్టు ఓ ప్రేమకథ, ఫ్యామిలీ  ఎమోషన్‌పై దర్శకుడు రాసుకున్న ఈ కథలో హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమీ లేదు. సినిమా అంత ఆద్యంతం టీవీ దొంగతనానికి, ఓ ప్రేమకథను జోడించి ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. 

అయితే ఇలాంటి సింపుల్‌లైన్‌తో ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా థియేటర్‌లో కూర్చొబెట్టడం అంతా ఈజీ కాదు. అయితే ఈ స్టోరీ లైన్‌కు  ఎమోషన్‌ కంటెంట్‌ను యాడ్‌ చేసి దర్శకుడు స్ట్రాంగ్‌ డ్రామాను స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేయగలిగితేనే అది సాధ్యం. ఈ విషయంలో తిమ్మరాజు పల్లి టీవీ పాస్‌ మార్కులు సంపాందించుకుంది. ఇలాంటి రూరల్‌ డ్రామాకు దర్శకుడు బలవంతంగా ఎలాంటి కమర్షియల్‌ అంశాలు జోడించకుండా నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం ప్రశంసనీయం. పల్లెటూరిలో మనుషుల మసస్తత్వాలు, అక్కడి ప్రేమలు, ఇగోలు, చూపించిన విధానం సహజంగా ఉంది. అప్పటి వరకు టీవీ చుట్టు తిరిగే కథలో హీరో, హీరోయిన్‌ ప్రేమాయణం గురించి తెలిసిన తరువాత కథలో ఆసక్తి పెరుగుతుంది. 

తొలిభాగం సరదా సరదాగా కొనసాగిన ఈ సినిమాలో అసలైన కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. హీరో తన మీద పడిన అభియోగం నుంచి ఎలా బయటపడ్డాడు. అసలు టీవీ దొంగతనం ఎవరు చేశారు అనే సన్నివేశాల విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది. అయితే టీవీ దొంగతనం చేసింది ఎవరో అనే విషయాన్ని చివరి వరకు ఆడియన్స్‌ గెస్‌ చేయకుండా, ఎవరి ఊహలకు చిక్కకుండా దర్శకుడు ఆ సన్నివేశాల రూపకల్పన విషయంలో తీసుకున్న జాగ్రత్త అభినందనీయం. పతాక సన్నివేశాల్లో టీవీ వల్ల భార్యభర్తల అనుబంధానికి కలిగే ఇబ్బంది, ఆ సన్నివేశాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించిన విధానం హృదయాలకు హత్తుకుంటుంది. 

ఈ సినిమా నిండా కొత్త వాళ్లు కనిపించినా ఎక్కడా కూడా, ఎవరిలో కూడా నటనలో చిన్న తడబాటు కూడా కనిపించలేదు. అందరూ ఎంతో సహజంగా నటించారు.సతీష్‌గా సాయితేజ్‌, శారదగా వేద, రాజప్పగా ప్రదీప్‌, ఊరి సర్పంచ్‌ రామచంద్రయ్యగా అమ్మ రమేష్‌ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు తన రియల్‌లైఫ్‌లో తను చూసిన సంఘటనలను ఆధారంగా తయారుచేసిన ఈ కథను ఎంతో నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. సాధారణంగా మలయాళంలో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో సినిమాలు వస్తుంటాయి. 

ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ కూడా సినిమా చూస్తున్న ఆడియన్స్‌కు అదే ఫీల్‌ను కలిగిస్తుంది. సినిమా ఆద్యంతం ఓ పల్లెటూరి వాతావరణంలో అందంగా చిత్రీకరించారు. కిరణ్‌ అబ్బవరం నిర్మాతగా ఓ చిన్న సినిమాను తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీగా నిర్మించాడు. పాటలు ప్రత్యేకంగా లేకుండా కథలో భాగంగా ఉండటం సినిమాకు ప్లస్‌ అయ్యింది. కథ మూడ్‌ను అనుసరించి కెమెరామెన్‌ తన విజువల్స్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడు. పల్లెటూరి వాతావరణంలో ఆద్యంతం ఆహ్లాదభరితంగా, సహజమైన నటీనటులతో రూపొందిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ గురించి పక్కన పెడితే  సినిమా చూసిన ప్రేక్షకులు ఓ మంచి ప్రయత్నం అని మాత్రం అభినందిస్తారు.

Movie Details

Movie Name: Thimmarajupalli TV

Release Date:

Cast: Sai Tej, Vedha Jalandharr, Pradeep Kotte, Swathi Karimireddy, Amma Ramesh, Satyanarayana, Lathish

Director: V. Muniraju

Producer: Kiran Abbavaram

Music: Vamsikanth Rekhan

Banner: KA Productions

Thimmarajupalli TV Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews