రజనీకాంత్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'జైలర్' సంచలన విజయాన్ని సాధించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి రజనీ అభిమానులు ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్ గా 'జైలర్ 2' రూపొందింది. ఈ రోజు ( అక్టోబర్ 15వ తేదీ)న ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు.

విగ్రహాల అక్రమ రవాణా చేసే వర్మన్ (వినాయకన్)తో చేతులు కలిపిన కారణంగా కన్నకొడుకునే ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్) లేపేస్తాడు. అతని చావుకు కారణం తానేననే విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యుల దగ్గర దాస్తాడు. ఆ తరువాత 'వర్మన్' ను కూడా అంతం చేస్తాడు. మూడు కంటైనర్లలో వర్మన్ తరలించవలసిన విగ్రహాలను ముత్తు దాచేస్తాడు. వాటి ఖరీదు 6 వేల కోట్లు కావడంతో, ప్రధాన సూత్రధారులు ఆలోచనలో పడతారు. ఆ మూడు కంటైనర్లను వెతికి పట్టుకోవడం కోసం, దిలీప్ ( సూరజ్ వెంజరమూడు)ను రంగంలోకి దింపుతారు. 

వర్మన్ ను అంతం చేసినవాడు .. కంటైనర్లు కనబడకుండా చేసినవాడు ఎవరనేది తెలుసుకోవడం కోసం దిలీప్ తన అనుచరులను నియమిస్తాడు. వాళ్లంతా అందుకు సంబంధించిన వెతుకులాటలో నిమగ్నమవుతారు. అసలు విగ్రహాలు ఎక్కడికి తరలించబడుతున్నాయి? ఈ నెట్ వర్క్ ను ఎవరు ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు? అనేది తెలుసుకోవడం ముత్తు ప్రయత్నిస్తూ ఉంటాడు. దిలీప్ ఈ విషయాన్ని డీల్ చేయలేకపోతున్నాడని భావించిన 'బోధి కల్పాక్' (ఎస్ జె సూర్య) నేరుగా రంగంలోకి దిగుతాడు.

చక్రి కల్పాక్ (మిథున్ చక్రవర్తి) ఓ మాఫియా ముఠా నాయకుడు. ప్రస్తుతం అతను వీల్ ఛైర్ కి పరిమితమై ఉంటాడు. తన కొడుకు బోధి కల్పాక్ .. కూతురు 'కాంతా' (విద్యాబాలన్)తో అతను ఈ నెట్ వర్క్ ను నడిపిస్తుంటాడు. తమ బిజినెస్ కి ఎవరు అడ్డొచ్చినా లేపేయడం వాళ్లకి చాలా సాధారణమైన విషయం. అలాంటి బోధి కల్పాక్,  6 వేల కోట్ల ఖరీదు చేసే విగ్రహాలు తమకి దక్కకుండా చేస్తున్నది ముత్తు అని తెలుసుకుని బరిలోకి దిగుతాడు. తన గ్యాంగ్ తో కలిసి అతను ఏం చేస్తాడు? వాళ్లను ముత్తు ఎలా ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

విగ్రహాల అక్రమ రవాణాకి సంబంధించిన మూలాలు తెలుసుకోవడం కోసం, 6 వేల కోట్ల ఖరీదు చేసే విగ్రహాలను 'ముత్తు' దాచేస్తాడు. అతని దగ్గర నుంచి ఆ కంటైనర్లను తీసుకెళ్లడం కోసం విలన్ గ్యాంగ్ రంగంలోకి దిగడమే ఈ కథలోని ప్రధానమైన అంశం. తన ఇంటికి పట్టిన చీడను మాత్రమే కాదు, సమాజానికి పట్టిన చీడను కూడా వదిలించడం కోసం ఒక మాజీ జైలర్ చేసిన పోరాటంగా ఈ కథ నడుస్తుంది.
                    
'ముత్తు' ఒక సూపర్ మార్కెట్ లో సూపర్ వైజర్ గా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉండగా, చాలా సాదాసీదాగా ఈ కథను మొదలుపెట్టారు. కొడుకును తన చేతులతో చంపవలసి వచ్చిందే అనే బాధ ఒక వైపు, ఆ నిజాన్ని భార్యతో .. కోడలుతో చెప్పలేక మరో వైపున మానసిక సంఘర్షణను అనుభవించే ముత్తును ప్రధానంగా చేసుకుని ఈ కథ కదులుతుంది. కుదిరితే శారీరకంగా .. లేదంటే మానసికంగా ఆయనను బలహీనపరిచడానికి విలన్ గ్యాంగ్ చేసే ప్రయత్నాలతో ఈ కథ పుంజుకుంటుంది. 

వేల కోట్ల విలువైన విగ్రహాలు తమ స్థావరానికి చేరకుండా అడ్డుకున్నది ఎవరనేది తెలుకోవడానికి విలన్ గ్యాంగ్ .. ఆ విగ్రహాల అక్రమ రవాణా వెనకున్నది ఎవరనేది కనుక్కోవడానికి హీరో చేసే ప్రయత్నాలతో ఫస్టాఫ్ కొనసాగుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తలపడటానికి సిద్ధమవడంతో సెకండాఫ్ పరిగెడుతుంది. మూర్తి అనే లోకల్ రౌడీ .. అతనికి డ్రైవర్ గా రజనీ .. వాళ్లిద్దరినీ గమనిస్తూ యోగిబాబు .. ఈ ముగ్గురి కాంబినేషన్ లోని సన్నివేశాలు ఫస్టాఫ్ ను ఆసక్తికరంగా నడిపించడమే కాదు, సరదాగా నవ్విస్తాయి. 

ఇక సెకండాఫ్ లోనే మిథున్ చక్రవర్తి .. విద్యాబాలన్ .. ఎస్ జె సూర్య పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. అయితే ఈ మూడు పాత్రల విలనిజం, గతంలో వచ్చిన 'జైలర్'లోని వినాయకన్ విలనిజం ముందు తేలిపోతాయి. తెరపై చాలా రొటీన్ గా కనిపిస్తాయి. సెకండాఫ్ లో గతంలో మాదిరిగానే మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. జాకీ ష్రాఫ్ కనిపిస్తారు. బోనస్ గా ఈ సారి హృతిక్ రోషన్ .. చివర్లో విజయ్ సేతుపతి కూడా మెరిశారు. 

మున్సిపల్ వాటర్ కి సంబంధించిన ఎపిసోడ్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ .. ప్రీ క్లైమాక్స్ లోని ఎమోషన్ .. లేడీస్ టీమ్ యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టాఫ్ లో వచ్చే 'పూర్ణ' స్పెషల్ సాంగ్ .. కొరియోగ్రఫీ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఇక సెకండాఫ్ లోని ఐటమ్ సాంగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువల పరంగా వంకబెట్టవలసిన పని లేదు. విజయ్ కార్తీక్ ఫొటోగ్రఫీ బాగుంది .. అనిరుధ్ సంగీతం మెప్పిస్తుంది. నిర్మల్ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గానే అనిపిస్తుంది.

 రజనీ తన వయసుకి తగిన పాత్రలో .. స్టైలీష్ లుక్ తో .. 'టైగర్ కా హుకుమ్' అంటూ సందడి చేశారు. రమ్యకృష్ణ .. విద్యాబాలన్ పాత్రల పరిధి తక్కువే. ఎస్ జె సూర్య విలనిజం రొటీన్ గానే అనిపిస్తుంది.  సూరజ్ వెంజమూడు .. యోగిబాబు నటన ఆకట్టుకుంటుంది. 'మూర్తి' పాత్ర .. ఆ పాత్రలో   నమో నారాయణ నటన ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. అమాయకత్వంతో కూడిన రౌడీయిజం కలిగిన ఈ పాత్రలో ఆయన జీవించాడని చెప్పాలి.

ఈ సినిమా ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా .. వినోదభరితంగా సాగుతుంది. సెకండాఫ్ లో మాత్రం విలన్ మూకలు చేసే హడావిడియే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గతంలో మాదిరిగా భయపెట్టే విలనిజం లేకపోవడం మాత్రం ఆడియన్స్ ను కాస్త నిరుత్సాహపరుస్తుంది. రజనీ స్టైల్ .. రజనీ మార్క్ యాక్షన్ ను కోరుకునేవారిని మాత్రం ఈ సినిమా నిరాశపరచదనే చెప్పాలి.