రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన సోదరుడి కొడుకైన మాధవ్, 'మారెమ్మ' సినిమాతో హీరోగా తెరపైకి వచ్చాడు. ఆయన జోడీగా ఈ సినిమాలో దీపాబాలు కనిపించనుంది. 'హార్ట్ బీట్' సిరీస్ తో యూత్ మనసులు కొల్లగొట్టిన దీపాబాలు, విలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నటించింది. సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

అది వరంగల్ పరిధిలోని 'మహిషాపురం'. ఆ విలేజ్ లో 'కర్ణి' (మాధవ్) బర్రెలు కాస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తాగుడుకి బానిసై తండ్రి చనిపోవడంతో, కుటుంబ భారం తనపై పడుతుంది. తనకి మరదలైన మంజుల ( దీపా బాలు)ను అతను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే మంజులపై మనసు పారేసుకున్న 'ఉత్తమ్' (మనీశ్), 'కర్ణి'పై కాస్త గుర్రుగా ఉంటాడు. అతను ఆ పక్కనే ఉన్న 'రామాపురం' యువకుడు అయినప్పటికీ, మంజులను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. 

'కర్ణి' ఎంతో ప్రేమగా చూసుకుంటున్న దున్నపోతు పేరే 'మారి' ఆ ఊరు గ్రామదేవత అయిన 'మారెమ్మ'కి బలి ఇవ్వడం కోసం దానిని పెంచుతూ ఉంటారు. ఒకసారి వరదల కారణంగా ఆ ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు దున్నపోతును బలి ఇవ్వగానే ఆ వరద తగ్గిపోతుంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జాతర జరిపి దున్నపోతును 'బలి' ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. బలి పశువును మేపే కుటుంబంగా 'కర్ణి' ఫ్యామిలీ ఉంటుంది. అయితే ఆ సంఘటన తలచుకుంటేనే 'కర్ణి' తట్టుకోలేకపోతుంటాడు. 

ఇదిలా ఉండగా కర్ణి కారణంగా .. మారి కారణంగా ఒకసారి 'జలంధర్'కి అవమానం జరుగుతుంది. అప్పటి నుంచి అతను ఆ దున్నపోతును చంపాలని పగతో రగిలిపోతుంటాడు. దుష్టశక్తుల ద్వారా ఆ దున్నపోతును వశం చేసుకునికి చంపాలనే ఉద్దేశంతో, ఒక మాంత్రికురాలను జలంధర్ సంప్రదిస్తాడు.  ఆమె ఇచ్చిన ఒక మంత్రించిన తాయెత్తును 'మారి' మెడలో కడతాడు. అప్పటి నుంచి అది కనిపించకుండా పోతుంది. మారి ఏమైపోతుంది? కర్ణికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? మంజుల పెళ్లి ఎవరితో జరుగుతుంది? అనేది మిగతా కథ.

 గ్రామదేవతలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కరవు కాటకాల నుంచి .. వానలు వరదల నుంచి .. అంటువ్యాధుల నుంచి తమని గ్రామదేవత కాపాడుతుందని గ్రామస్తులు భావిస్తూ ఉంటారు. ఆ దేవతకి జాతర నిర్వహిస్తూ ఉంటారు. అలా పదేళ్లకు ఒకసారి దున్నపోతును బలిచ్చే ఆనవాయితీ గల ఒక గ్రామం ఉంటుంది. జాతరకు ముందు ఆ దున్నపోతు కనిపించకుండా పోవడం, ఈ కథలో కుతూహలాన్ని రేకెత్తించే అంశం. 

హీరో మంజుల అనే అమ్మాయిపై మనసు పారేసుకుంటాడు. అలాగే 'మారి' అనే దున్నపోతును ఎంతో ప్రేమగా పెంచుతాడు. అయితే ఈ రెండు వైపుల నుంచి అతనికి శత్రువులు తయారవుతారు. మంజులను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉత్తమ్ .. 'మారి'ని చంపాలనే కసితో జలంధర్ రంగంలోకి దిగుతారు. అలాంటి పరిస్థితులలో హీరో ఏం చేస్తాడు? అనే ఒక ఆసక్తి ఆడియన్స్ ను కథ వెంట నడిపిస్తుంది.

పల్లెటూళ్లు .. పల్లెప్రజల విశ్వాసాలు .. గ్రామదేవతలు .. జాతరలు .. క్షుద్రశక్తులు .. బలి .. ఇలా పూర్తిస్థాయి విలేజ్ నేపథ్యాన్ని కళ్లముందు ఉంచడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. ప్రేమ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ప్రధానమైన కథను పరిగెత్తించడానికి ట్రై చేశాడు. అయితే ప్రతి అంశాన్ని లైట్ గా టచ్ చేయడమే లోపంగా అనిపిస్తుంది. 'ధర్మాన్న'గా వినోద్ కుమార్ .. మంజులను దక్కించుకోవాలనుకున్న 'ఉత్తమ్' పాత్రలు పూర్తిగా తేలిపోతాయి. 'జలంధర్' పాత్ర కాస్త హడావిడి చేస్తుంది.

దున్నపోతు కనిపించకుండా పోవడంతో కథలో మరింత ఉత్కంఠ పెరిగిపోవాలి. జాతర చేసే మహిషాపురం వాళ్లు .. ఆ దున్నపోతును చంపాలనుకున్న శత్రువులు కూడా దాని కోసం వెదుకుతూ ఉండటంతో, దానిని ఎవరు ఏం చేసి ఉంటారనే ఆసక్తి పెరుగుతూ వెళ్లాలి. కానీ కథ అక్కడి నుంచే నిదానిస్తుంది. బలహీనమైన సన్నివేశాలతోనే కదులుతూ ఉంటుంది. క్షుద్రపూజలతో కాస్త భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు గానీ వర్కౌట్ కాలేదు.

ప్రశాంత్ అంకిరెడ్డి ఫొటోగ్రఫీ .. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం .. సాయిబాబు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. మాధవ్ కి ఇది ఫస్టు సినిమానే గనుక, ఆ కొత్తదనం తెలుస్తూనే ఉంది. దీపాబాలు మంచి ఆర్టిస్ట్. ఆ అమ్మాయి పాత్రను ఇంకాస్త ఆకర్షణీయంగా మలిచే ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణ విలేజ్ నేపథ్యం .. విశ్వాసాలు తెరపై చూపించాలనే ప్రయత్నం మంచిదే. కానీ కథపై సరైన కసరత్తు జరగకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది.