ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ సినిమా నేపథ్య సినిమాల పరంపర కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన మరో సినిమా 'క్రేజీ కళ్యాణం', అనుపమ పరమేశ్వరన్, అఖిల్‌ రాజ్‌, తరుణ్‌ భాస్కర్‌, నరేష్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది? ఇక ఈ 'క్రేజీ కళ్యాణం' కథ ఏమిటి? ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? ఈ సినిమా ఎలాంటి వినోదాన్ని పంచింది. 

పర్వతాలు (నరేష్‌ వీకే)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతుర్ని బాలరాజు (తరుణ్‌ భాస్కర్‌)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ బాలరాజు పని పాటా లేకుండా మద్యానికి బానిసై ఊళ్లో అప్పులు చేస్తూ ఇల్లరికం ఉంటూ ఇంటికిపైకి రోజుకో గొడవ తెచ్చిపెడుతుంటాడు. దీంతో పర్వతాలు ఊళ్లో పెద్దల్లుడు వల్ల తన పరువంతా పోయిందని, ఊళ్లో తల్లెత్తుకోలేకుండా ఉండాల్సి వస్తుందని బాధపడుతుంటాడు. అందుకే తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్‌)కి  గొప్పింటి సంబంధం చూసి మంచి గుణం, ఎటువంటి చెడు అలవాట్లు లేని అబ్బాయికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి ఊర్లో పోయిన పరువును తిరిగి కాపాడుకోవాలని అనుకుంటాడు. 

అయితే ఇందుకోసం తన అన్న కూతురుకు వచ్చిన అమెరికా సంబంధాన్ని చెడగొట్టి, ఆ అబ్బాయికి కీర్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్‌ చేస్తాడు. కానీ కీర్తి చదువుకొని ప్రభుత్వం ఉద్యోగం సంపాందించి తాను ప్రేమించిన అబ్బాయి ఉదయ్‌ (అఖిల్‌)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇదే విషయాన్ని పర్వతాలుకు చెప్పడంతో ఆయన ఒప్పుకోడు. సరికదా ఎలాగైనా యూఎస్‌ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబడతాడు. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? కీర్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా?  కీర్తి-ఉదయ్‌ల పెళ్లి జరిగిందా? లేక తండ్రి చూసిన యూఎస్‌ అబ్బాయినే కీర్తి వివాహాం చేసుకుందా? అనేది మిగతా కథ. 


తెలంగాణ నేపథ్యంలో.. తెలంగాణ యాస, సంస్కృతి ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. తెలంగాణ నేపథ్యానికి తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని.. ఓ లవ్‌స్టోరిని, ఫ్యామిలీ ఎమోషనల్‌ అంశాలను మేళవించి దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. పోయిన పరువు సంపాందించడం కోసం తన కూతురిని ఓ పెద్దింటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునే తండ్రికి, చదువుకుని ఉద్యోగం సంపాందించి తన కాళ్లకు తాను నిలబడి, తాను కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకునే కూతురికి మధ్య జరిగే ఎమోషనల్‌ డ్రామానే ఈ చిత్ర కథ సారాంశం. ప్రతి తండ్రి కూతురు పెళ్లి కోసం ఆరాటపడుతూ అప్పులు చేసి మరి వాళ్ల పెళ్లిళ్లు ఖర్చుతో చేస్తుంటారు. 

అయితే ఆ పెళ్లి ఖర్చులో కొంత భాగం వాళ్ల చదువుకు ఖర్చుపెడితే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే స్థాయికి ఎదుగుతారని తల్లిదండ్రులు ఆలోచించే విధంగా ఈ చిత్రంలో ఓ సందేశాన్ని మిక్స్‌ చేశాడు దర్శకుడు. ఈ సినిమా ఫస్టాఫ్‌లో పెద్ద కథేమీ కనిపించకపోయినా సరదా సరదాగా అలా సాగిపోతుంది. బాలరాజు వల్ల పర్వతాలు కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది వినోదాత్మక చూపించే ప్రయత్నం చేశారు. అది కొంత వరకు వర్కవుట్‌ అయ్యింది. అయితే ఉదయ్‌-కీర్తిల ప్రేమకథలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. 

ఇక సెకండాఫ్‌లో కీర్తి తను కోరుకున్న ఉద్యోగాన్ని, ప్రేమించిన కుర్రాడిని దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది. అయితే ఇందులో కూడా చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమీ కనిపించవు. అయితే పతాక సన్నివేశాలతో పాటు సినిమాలోని చివరి 30 నిమిషాలను దర్శకుడు పూర్తి భావోద్వేగంగా మలిచాడు. ఈ సన్నివేశాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. ఓవరాల్‌గా 'క్రేజీ కళ్యాణం' కాస్త ఫన్‌.. కాస్త ఎమోషన్‌ అనే తరహాలో ఓ మోస్తరుగా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఆత్మభిమానం, సొంత కాళ్లపై నిలబడాలని అనుకునే పల్లెట్లూరి అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్‌ నటన అలరిస్తుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ కీర్తి పాత్రలో ఎంతో సహజంగా నటించింది. ఉదయ్‌ పాత్రలో అఖిల్‌ నటనకు పెద్ద స్కోప్‌ లభించలేదు.పర్వతాలు పాత్రలో నరేశ్‌ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలో నరేష్‌ నటన కంట తడి పెట్టిస్తుంది. బాలరాజుగా తరుణ్‌ భాస్కర్‌ అలరించాడు. 

అయితే ఈ పాత్రను మరింత ఫన్‌గా తీర్చిదిద్దితే బాగుండేది. దర్శకుడు భద్రప్ప ఎమోషన్స్‌ సీన్స్ తెరకెక్కించడంలో తన ప్రతిభను చూపాడు. అయితే రచనా పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 

ఓవరాల్‌గా  రూరల్‌ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన 'క్రేజీ కళ్యాణం' తెలంగాణ నేపథ్య సినిమాలు, భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడే వారిని మోస్తరుగా అలరిస్తుంది.