కథానాయకుడిగా హర్ష చెముడు అడపాదడపా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన వినోదభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటున్నాడు. అలాంటి హర్ష నుంచి 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అనే సిరీస్ వచ్చింది. 6 ఎపిసోడ్స్ తో రూపొందిన ఈ సిరీస్ కి, బాబు డేగల దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

'మాచర్ల' పరిధిలోని 'రెంట చింతల' అనే విలేజ్ అది. అక్కడ శ్రీనివాసరావు ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. ఆయన ఐదు ఎకరాల భూమిని .. రెండు రైసు మిల్లులను చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకే 'తేజ' (హర్ష చెముడు). నల్లగా .. లావుగా ఉండే తేజకి, పెళ్లీడు కూడా దాటిపోతూ ఉంటుంది. దాంతో తమ కొడుక్కి పెళ్లి కాకుండా పోతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. హైదరాబాద్ వెళ్లి ఏదైనా సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ సంపాదిస్తే, అమ్మాయిలు వెతుక్కుంటూ వస్తారని తేజకి స్నేహితుడు రమేశ్ సలహా ఇస్తాడు.  

పెళ్లి కావాలంటే ముందుగా మంచి జాబ్ కావాలనే తేజ ఆలోచనను తండ్రి సమర్థిస్తాడు. దగ్గరుండీ మరీ హైదరాబాద్ పంపిస్తాడు. హైదరాబాద్ లో ఫ్రెండ్ రూములో ఉంటూ మొత్తానికి ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో తేజ జాబ్ సంపాదిస్తాడు. అక్కడే 'మధు' (ఐశ్వర్య ) పనిచేస్తూ ఉంటుంది. అక్కడే అతనికి 'నాయుడు' .. గోపీ .. అనూష .. సునీత పరిచయమవుతారు. నాయుడు అక్కడ పనిమనిషిగా ఉన్న 'సునీత'ను ఇష్టపడతాడు. ఇక గోపీ .. అనూష తరచూ గొడవపడుతూ ఉంటారు. తేజ దగ్గర సబ్జెక్ట్ లేదనే అసహనాన్ని చూపిస్తూ ఉంటుంది మధు. 

 ఈ నేపథ్యంలోనే అనుకోకుండా తేజకి .. మధుకి పెళ్లి చూపులు జరుగుతాయి. మధుకి అభ్యంతరం లేకపోతే, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉండేలా చేస్తానని తేజ తండ్రి శ్రీనివాసరావు చెబుతాడు. తనతో పెళ్లికి .. అంతవరకూ తనతో కలిసి ఉండటానికి మధు ఎలాంటి పరిస్థితులలోను ఒప్పుకోదని తేజ భావిస్తాడు. కానీ విదేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్న మధు, 'వీసా' వచ్చేవరకూ 'తేజ' ఫ్లాట్ లో ఉండటం బెటర్ అనుకుంటుంది. ఇద్దరూ ఒకే కప్పు క్రిందికి చేరతారు.

అయితే తామిద్దరం కలిసి ఉంటున్నట్టుగా ఆఫీసులో ఎవరికీ చెప్పద్దని తేజతో అంటుంది మధు.  రోజులు గడుస్తుంటాయి. నాయుడు - సునీత మధ్య ప్రేమ పెరుగుతూ వెళుతుంది. అలాగే అపరిచితురాలు వాయిస్ తో ఫోన్లో గోపీతో మాట్లాడుతూ అతని మనసు కొల్లగొడుతుంది అనూష.   ఒక రోజున గోపీ ఒత్తిడి చేయడంతో అతని మాట కాదనలేక ఆ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తాడు తేజ. అతను చెప్పిన సమయానికంటే ముందుగానే గోపీ బృందం తేజ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.

అందంగా ఉంటేనే అమ్మాయిలు తిరిగి చూస్తారు .. స్టైలీష్ గా కనిపిస్తేనే మాట కలుపుతారు .. కార్పొరేట్ జాబ్ చేస్తేనే ప్రేమిస్తారు .. మంచి శాలరీ ఉంటేనే పెళ్లి చేసుకుంటారని కొంతమంది అబ్బాయిలు భావిస్తూ ఉంటారు. అందువలన ఆ అర్హతలను సంపాదించుకోవడానికి అబ్బాయిలు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇక తమ ఏజ్ గ్రూప్ కూడా ఎక్కువగా ఉంటే ఆ అబ్బాయిలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక యువకుడి చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

ఉన్న ఊళ్లో హాయిగా వ్యవసాయం చేసుకునే యువకులకు .. స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ దర్జాగా బ్రతికే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. ఇక ఆకర్షణీయమైన రూపం .. హుందాగా బ్రతికే ఉద్యోగం లేనివాళ్లు పెళ్లి అనే రెండు అక్షరాలకు చాలా దూరంలో ఆగిపోతున్నారు. అలాంటి యువకులు పెళ్లి కోసమే పట్నం బాటపడుతున్నారు. అందుకు నిదర్శనంగా ఈ సిరీస్ లోని కథానాయకుడి జీవితం కూడా కనిపిస్తుంది. అతనికి ఎదురయ్యే అనుభవాలు .. అనుభూతులు సన్నివేశాలుగా కదులుతూ ఉంటాయి. 

తన రూపం పట్ల అసంతృప్తి .. ఏజ్ ఎక్కువైపోయిందనే ఆందోళన .. అలవాటులేని సిటీ వాతావరణం. అలాంటి పరిస్థితులలో 'తేజ' అక్కడ ఎలా నెట్టుకు రాగలుగుతాడు? సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిపించుకోవడానికి ఏం చేస్తాడు? ఎలాంటి అవమానాలను ఫేస్ చేస్తాడు? చివరికి తాను అనుకున్నది సాధించగలుగుతాడా లేదా? అనేవి ఈ సిరీస్ లోని ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.

 ఒక చిన్నపాటి సాఫ్ట్ వేర్ ఆఫీస్ .. అక్కడ రకరకాల స్వభావాలు గలవారిని టచ్ చేస్తూ వెళ్లారు. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా నటన పరంగా మంచి నైపుణ్యాన్ని చూపించారు. హర్ష ..  హైపర్ ఆది .. జీవన్ కుమార్ నటన గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో 'అనూష' పాత్రను పోషించిన 'శ్రావ్య' ఎక్కువ మార్కులు దక్కించుకుంటుంది. శక్తి అరవింద్ ఫొటోగ్రఫీ .. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం .. లిఖిత్ ఎడిటింగ్ ఫరవాలేదు.    

ఒక వైపున పల్లె జీవితం .. మరో వైపున పట్నం లైఫ్ స్టైల్ ను ఆవిష్కరించిన తీరు బాగుంది. అలాగే అందంగా కనిపించేవారికంటే అందమైన మనసున్నవారిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా సుఖపడతారనే సందేశం మనకి ఈ సిరీస్ లో కనిపిస్తుంది. అందంగా లేడని అమ్మాయిలు లైట్ తీసుకోవడం .. ఆ తరువాత వాళ్ల మనసు మంచిదని గ్రహించి దగ్గరవడం వంటి కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. చూస్తున్నంత సేపు బోర్ అనిపించదు గానీ, కథాకథనాలలో ఎక్కడా కొత్తదనం లేని కారణంగా రొటీన్ గా మాత్రం అనిపిస్తుంది.