మరణశిక్ష రద్దు.. సౌదీలో శ్రీలంక హిందూ వ్యక్తికి ఊరట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరణశిక్ష రద్దు.. సౌదీలో శ్రీలంక హిందూ వ్యక్తికి ఊరట!

Death penalty revoked relief for Sri Lankan Hindu man in Saudi Arabia
  • అనోజన్‌ శివరాస మరణశిక్ష రద్దు
  • ఫేస్‌బుక్‌లో ప్రవక్తపై వ్యాఖ్యలతో మొదలైన వివాదం
  • తొలుత ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా
  • అప్పీల్‌ కోర్టులో మరణశిక్షగా మారిన తీర్పు
  • శ్రీలంక దౌత్య, న్యాయ ప్రయత్నాలతో ఉపశమనం
సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న శ్రీలంకకు చెందిన హిందూ వలస కార్మికుడు అనోజన్‌ శివరాసకు ఊరట లభించింది. ప్రవక్త మహమ్మద్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్య చేశారనే ఆరోపణలతో విధించిన మరణశిక్షను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు రద్దు చేసింది. శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన దౌత్య, న్యాయపరమైన ప్రయత్నాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్టోబరు 13న ఈ తీర్పు వెలువడినట్లు శ్రీలంక విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది.

24 ఏళ్ల అనోజన్‌ ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో చర్చ సందర్భంగా తమిళంలో ఓ వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యపై వివాదం చెలరేగడంతో దాన్ని తొలగించి క్షమాపణలు చెబుతూ వీడియో కూడా విడుదల చేశారు. అయినప్పటికీ స్క్రీన్‌షాట్లు వైరల్‌ కావడంతో సౌదీ అరేబియాలోని ఆయన యజమానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అక్కడి అధికారులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

జులై 15న అల్‌ అహ్సా క్రిమినల్‌ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాళ్ల జరిమానా విధించింది. అనంతరం సెప్టెంబరు 17న అప్పీల్‌ కోర్టు ఆ శిక్షను మరణశిక్షగా మార్చింది. దీంతో శ్రీలంక ప్రభుత్వం దౌత్యపరంగా రంగంలోకి దిగింది. న్యాయ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని రియాద్‌కు పంపి సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. శ్రీలంకలోని పలువురు రాజకీయ, మతపెద్దలు కూడా ఆయనకు క్షమాభిక్ష కల్పించాలని కోరారు.

అయితే, మరణశిక్ష రద్దయినప్పటికీ అనోజన్‌కు పూర్తి ఊరట లభించినట్లు కాదు. ఆయనకు గతంలో విధించిన ఐదేళ్ల జైలు శిక్ష అమలవుతుందా? లేక కేసు పూర్తిగా కొట్టివేస్తారా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
Advertisement
Anojan Sivaraasa
Saudi Arabia death penalty
Sri Lankan Hindu migrant
Prophet Muhammad comment case
Saudi Supreme Court verdict
Sri Lanka diplomatic efforts

More Telugu News