తెలంగాణ తెగువకు, ధిక్కార స్వరానికి ఐలమ్మ నిలువెత్తు రూపం: కేసీఆర్

తెలంగాణ తెగువకు, ధిక్కార స్వరానికి ఐలమ్మ నిలువెత్తు రూపం: కేసీఆర్

KCR calls Chakali Ailamma the personification of Telangana bravery and defiance
  • నేడు చాకలి ఐలమ్మ 131వ జయంతి
  • ఘన నివాళి అర్పించిన కేసీఆర్
  • నాటి రాచరిక వ్యవస్థను ధైర్యంగా ఎదిరించిన వీరవనిత అని కేసీఆర్ కితాబు
  • ఐలమ్మ పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శనీయమని వ్యాఖ్య
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ... తెలంగాణ తెగువకు, ధిక్కార స్వరానికి ఆమె నిలువెత్తు రూపమని కొనియాడారు. నాటి రాచరిక వ్యవస్థను ధైర్యంగా ఎదిరించి, రైతాంగ హక్కుల కోసం పోరాడిన ధీర వనిత అని ప్రశంసించారు. అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఆమె ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. 

కేవలం భూస్వాములను వ్యతిరేకించడమే కాకుండా, అప్పట్లోనే చట్టాల పరిధిలో కోర్టుల ద్వారా న్యాయం పొంది ఆమె ప్రజాస్వామిక నిబద్ధతను చాటుకున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. ఐలమ్మ పోరాట పటిమ నేటి యువతకు ఎప్పుడూ ఆదర్శనీయమని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆమె స్ఫూర్తి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన శాంతియుత మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె పోరాట స్ఫూర్తి అంతర్భాగంగా ఉందన్నారు. 

చాకలి ఐలమ్మ చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని కేసీఆర్ వెల్లడించారు. ఐలమ్మ ఆశయాల సాధనే ధ్యేయంగా తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో మహిళా, శిశు సంక్షేమంతో పాటు రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతికి ఎన్నో విప్లవాత్మక పథకాలను అమలు చేశామని తెలిపారు. కులవృత్తులకు పునరుజ్జీవం పోసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మహోన్నతంగా నిలబెట్టామని, ఆనాడు తాము సాధించిన ప్రగతి నేడు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 
Advertisement
K Chandrashekar Rao
Chakali Ailamma
Telangana Armed Struggle
BRS Party
Chakali Ailamma Jayanthi
Telangana History

More Telugu News