అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సాయం.. చంద్రబాబు పాలనలో ఏపీ సురక్షితంగా ఉంటుంది: నడ్డా
- చంద్రబాబుతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటీలను ప్రారంభించిన నడ్డా
- సంజీవని పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే దిశగా ఆలోచిస్తామని వెల్లడి
- విజన్, నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబని ప్రశంస
విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ... అమరావతిలో ‘క్వాంటం బయో వ్యాలీ’ని ఏర్పాటు చేయాలనే చంద్రబాబు ఆలోచనను ఆకాశానికెత్తారు. బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలన్న వినతికి సానుకూలంగా స్పందించిన ఆయన, దీనికి అవసరమైన సాంకేతిక సాయం అందించేందుకు కేంద్రం నుంచి ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని అమరావతికి పంపుతామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు రూపొందించిన ‘సంజీవని’ పథకం ప్రాధాన్యతను కొనియాడిన నడ్డా.. దీనిని జాతీయ స్థాయిలో అమలు చేసే దిశగా ఆలోచిస్తామని తెలిపారు. చంద్రబాబు ప్రస్తావించిన ‘వంటిల్లే ఫార్మసీ - ఆహారమే ఔషధం’ అనే ఆలోచన సరైనదని, మెరుగైన ఆరోగ్యానికి అదే మూలసూత్రమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ-నీవా వంటి సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో సీఎం చిత్తశుద్ధిని ఆయన అభినందించారు. చంద్రబాబు విజన్, నిబద్ధత కలిగిన అరుదైన నాయకుడని, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబుతో కలిసి నడ్డా సెల్ఫీ దిగడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైద్య రంగానికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతను మెచ్చుకుంటూ, కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సంపూర్ణ సహకారం ఉంటుందని నడ్డా హామీ ఇచ్చారు.