నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం.. 85 శాతానికే పరిమితం కానున్న వర్షపాతం!

Southwest Monsoon El Nino impact rainfall to be limited to 85 percent
  • దేశంలో 70 శాతానికి పెరిగిన కరువు ముప్పు అని స్కైమెట్ వెల్లడి
  • బలపడుతున్న ఎల్ నినోనే వర్షాల లోటుకు ప్రధాన కారణం
  • ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ గణనీయంగా వర్షపాతం లోటు
  • సాధారణం కంటే తక్కువ వర్షాలేనన్న భారత వాతావరణ శాఖ
ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్, 2026 నైరుతి రుతుపవనాలపై ఆందోళనకర అంచనాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో కేవలం 85 శాతం మాత్రమే నమోదవుతుందని, దీంతో కరువు ముప్పు 70 శాతానికి పెరిగిందని స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో 94 శాతం వర్షపాతం ఉంటుందని అంచనా వేసిన సంస్థ, తాజా పరిస్థితులతో తన అంచనాను గణనీయంగా తగ్గించింది.

బలపడుతున్న ఎల్ నినో పరిస్థితుల కారణంగానే ఈ సవరణ చేసినట్లు స్కైమెట్ తెలిపింది. సెప్టెంబర్ నాటికి ఇది 'సూపర్ ఎల్ నినో' స్థాయికి చేరవచ్చని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ పేర్కొన్నారు. ఆగస్టులో 84 శాతం, సెప్టెంబర్‌లో 80 శాతం మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) సానుకూలంగా మారినా, దాని ప్రభావంపై అనిశ్చితి నెలకొంది.

ప్రస్తుతం జూన్ 1 నుంచి ఆగస్టు మధ్య వరకు దేశంలో వర్షపాతం ఇప్పటికే 13 శాతం లోటుతో ఉంది. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్పంలో 21 శాతం లోటు నమోదవగా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ వర్షపాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లోటు ఏకంగా 27 శాతంగా ఉంది.

మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా రుతుపవనాల రెండో అర్ధభాగంలో వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని అంచనా వేసింది. మొత్తం సీజన్‌లో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ గతంలో వెల్లడించింది. తాజా పరిణామాలతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Southwest Monsoon
El Nino
Skymet Weather
Rainfall Deficit
Drought Risk India
IMD Forecast

More Telugu News