మెగా డీఎస్సీ-2025: పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా డీఎస్సీ-2025: పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

Mega DSC 2025 AP High Court hears petition on teacher recruitment irregularities
  • మెగా డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిల్
  • క్రీడా కోటా నిబంధనలు మార్చి కొందరికి లబ్ధి చేకూర్చారని ఆరోపణ
  • అనర్హమైన స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో నియామకాలు జరిగాయన్న పిటిషనర్
  • వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను మూడు వారాలకు వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం చేపట్టిన మెగా డీఎస్సీ-2025 ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు కేవలం కొన్ని పొరపాట్లు కావని, ఇది వ్యవస్థీకృత వైఫల్యమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు ప్రభుత్వం క్రీడా కోటా విధానంలో కీలక మార్పులు చేసిందని శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్రీడా కోటా రిజర్వేషన్లను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారని, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలన్న నిబంధనను కూడా తొలగించారని తెలిపారు. ఈ మార్పుల ద్వారా ముందుగా నిర్ణయించుకున్న కొందరు అభ్యర్థులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా పారదర్శకత లేకుండా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

అర్హత లేని స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా పలువురు అభ్యర్థులు నియామకాలు పొందారని, దీనికి సంబంధించిన కొన్ని నమూనా సర్టిఫికెట్లను ఆయన కోర్టు ముందు ఉంచారు. గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు బదులుగా, కేవలం స్థానిక పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లను ఉపయోగించారని వాదించారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం క్రీడా కోటాకు సంబంధించిన జీవోలను వెనక్కి తీసుకుందని, ఈ చర్యే విధానపరమైన మార్పులపై తీవ్ర అనుమానాలకు తావిస్తోందని, కాబట్టి స్వతంత్ర దర్యాప్తు అవసరమని ఆయన పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తాము చాలా సమాచారాన్ని సేకరించామని, ప్రభుత్వం పూర్తి మెరిట్ జాబితాను ప్రచురించనందున కొన్ని ఉదాహరణలను మాత్రమే కోర్టు ముందు ఉంచగలిగామని వివరించారు. ప్రభుత్వ చర్యలకు, బెదిరింపులకు భయపడి చాలా మంది బాధితులు కోర్టును ఆశ్రయించడం లేదని కూడా ఆయన తెలిపారు. ఈ అంశం వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించినది కాబట్టి, వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దడానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారానే దర్యాప్తు కోరుతున్నామని స్పష్టం చేశారు.

వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Advertisement
Mega DSC 2025
AP High Court
Teacher Recruitment Scam
CBI Investigation
S Sriram Advocate
AP DSC Sports Quota

More Telugu News